HomeతెలంగాణNagarjunsagar: సింగరేణిలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది: నోముల భగత్

Nagarjunsagar: సింగరేణిలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది: నోముల భగత్

నాగార్జునసాగర్ / హాలియా, అక్టోబర్ 15 (తెలుగు ప్రభ): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన మొత్తం అవినీతిమయంగా మారిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ ఆరోపించారు. గురువారం హాలియాలోని తన క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడారు. 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు రాష్ట్రంలో 7,778 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉండేదని, ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే నాటికి విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని 24 వేల మెగావాట్లకు తీసుకువచ్చారని తెలిపారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం, పరిశ్రమలు, గృహ అవసరాలకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉండేదని పేర్కొన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయిందని, వ్యవసాయానికి ఐదు గంటల కరెంటు కూడా ఇచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. గృహ అవసరాలకు, పరిశ్రమలకు సైతం ప్రభుత్వం విద్యుత్ కోతలు విధిస్తోందని ఆరోపించారు. దామరచర్ల వద్ద 4,000 మెగావాట్ల సామర్థ్యంతో గత కేసీఆర్ ప్రభుత్వం యాదాద్రి పవర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. అయితే, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 400 మెగావాట్ల విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేయలేకపోతోందని విమర్శించారు. యాదాద్రి థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి చేయకపోవడానికి గల కారణాలను బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే, సింగరేణి సంస్థ బొగ్గు సరఫరా చేయడం లేదని చెప్పారని తెలిపారు. ఇదే విషయంపై బీఆర్ఎస్ నేతలు సింగరేణి ప్రధాన కార్యాలయానికి వెళ్లి ప్రశ్నించగా, ముఖ్యమంత్రి సింగరేణికి రూ.60 వేల కోట్ల బకాయి పడ్డారని చెప్పినట్లు పేర్కొన్నారు.

విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు కొనుగోలు చేసే పరిస్థితి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో సింగరేణిలో రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. సింగరేణి బొగ్గు కుంభకోణం విషయంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి నాటకమాడుతున్నాయని విమర్శించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. 2023లో సింగరేణి సంస్థ 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయగా, 2025లో కాంగ్రెస్ పాలనలో కేవలం 58 మిలియన్ టన్నుల బొగ్గు మాత్రమే ఉత్పత్తి చేసిందని తెలిపారు. కేసీఆర్ పాలనలో బొగ్గు కొరత, విద్యుత్ కొరత లేదని, పదేళ్ల పాటు బ్రహ్మాండంగా నడిచిన సింగరేణి ప్రస్తుతం ఈ దుస్థితికి చేరడానికి కారణం ఏమిటో ప్రజలు ఆలోచించాలని కోరారు.

రాష్ట్రానికి, సింగరేణికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఓటర్ల నమోదులో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చురుకుగా పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ ట్రైకార్ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్, రాష్ట్ర నాయకులు రిక్కల, ఇంద్రసేనారెడ్డి, బాబురావు నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News