Onion prices: ఉల్లి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గత రెండు నెలలుగా క్వింటాకు రూ.1,400 పలుకుతున్న ధర.. క్రమంగా తగ్గుతూ వస్తుంది. సోమవారం నాటికి రూ.1,100 వద్దకు చేరింది. అధిక దిగుబడితో పాటు ఎగుమతులు నిలిచిపోవడంతో ధరలు భారీగా క్షీణిస్తున్నాయి.
స్థానిక పంటపై మహారాష్ట్ర ఉల్లి ప్రభావం: మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌కు మహారాష్ట్ర నుంచి వస్తున్న మేలు రకపు ఉల్లి గరిష్టంగా క్వింటాకు రూ.1,100 లభిస్తుంది. దీంతో స్థానిక పంటకు ఆశించిన ధర దక్కడం లేదు. మహబూబ్‌నగర్, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి, కర్నూలు జిల్లాల నుంచి వచ్చే పంటకు క్వింటాకు కేవలం రూ.800 మాత్రమే ధర పలుకుతోంది.
ధరల పతనానికి ప్రధాన కారణాలు: గ్యాస్ కొరత కారణంగా అనేక హోటళ్లు మూతపడటంతో ఉల్లి వినియోగం గణనీయంగా పడిపోయింది. అంతేకాకుండా అధిక దిగుబడికి తోడు.. విదేశాలకు ఎగుమతులు ఆగిపోవడంతో మార్కెట్‌లో ఉల్లి నిల్వలు పేరుకుపోతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ వాతావరణం ఇలాగే కొనసాగితే.. మున్ముందు ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆవేదనలో రైతాంగం: గతేడాది ఏప్రిల్ నెలలో క్వింటా ఉల్లి ధర రూ.1,800 పలికింది. కానీ ఈ ఏడాది పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయి. అటు సాగు ఖర్చులు పెరగడం.. ఇటు మార్కెట్‌లో కనీస మద్దతు ధర లభించకపోవడంతో అన్నదాతలు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తెచ్చిన పంటను అమ్ముకోలేక.. వెనక్కి తీసుకెళ్లలేక మార్కెట్ యార్డుల్లోనే రైతులు దీనస్థితిలో ఎదురుచూస్తున్నారు.

