Friday, February 13, 2026
HomeతెలంగాణA Healthy Scoop: ఆరోగ్యానికి ‘రాగి’ణి.. ఐస్‌క్రీమ్‌లో సరికొత్త రుచి వాణి!

A Healthy Scoop: ఆరోగ్యానికి ‘రాగి’ణి.. ఐస్‌క్రీమ్‌లో సరికొత్త రుచి వాణి!

Vegan ragi milk ice cream :  ఐస్‌క్రీమ్‌… ఈ పేరు వింటే చాలు, వయసుతో సంబంధం లేకుండా అందరి నోళ్లలో నీళ్లూరుతాయి. కానీ, పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండే వీగన్లకు, లాక్టోస్‌ పడని వారికి ఈ ఆనందం అందని ద్రాక్షే. ఈ లోటును తీరుస్తూ, ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి జోడిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ ఫుడ్‌ టెక్నాలజీ విభాగం ఓ అద్భుత ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. చిరుధాన్యమైన రాగుల పాలతో రుచికరమైన ఐస్‌క్రీమ్‌ను తయారు చేసి ఔరా అనిపించారు. అసలు రాగులతో ఐస్‌క్రీమ్ తయారు చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? దీని తయారీ విధానం ఏంటి? ఇది సాధారణ ఐస్‌క్రీమ్‌ అంత రుచిగా ఉంటుందా?

- Advertisement -

ఆవిష్కరణకు అంకురార్పణ : ఉస్మానియా యూనివర్సిటీ ఫుడ్‌ టెక్నాలజీ విభాగంలో ఎంటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న నవీన్‌కుమార్‌ తన ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా ఈ వినూత్న ప్రయోగానికి నాంది పలికారు. ఆచార్యుల ప్రోత్సాహంతో, చిరుధాన్యాల నుంచి పాలు తీసే ప్రక్రియపై పరిశోధన ప్రారంభించారు. కొర్రలు, జొన్నలు, రాగులతో ప్రయోగాలు చేయగా, రాగుల నుంచే అత్యధికంగా పాలు ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. ఇదే తన ఆవిష్కరణకు పునాదిగా మారింది.

పావుకిలో రాగులు.. ఇరవై ఐస్‌క్రీమ్‌లు : ఈ ఐస్‌క్రీమ్ తయారీ ప్రక్రియ ఎంతో ఆసక్తికరం. నవీన్ కేవలం పావుకిలో (250 గ్రాములు) రాగులను ఉపయోగించి ఏకంగా 20 ఐస్‌క్రీమ్‌లను తయారు చేసి చూపించారు.

ప్రాసెసింగ్: ముందుగా రాగులను కొన్ని గంటల పాటు నానబెట్టి, సరైన ఉష్ణోగ్రత వద్ద ప్రెషర్ కుక్కర్‌లో ఉడికించారు.

పాలు తీయడం: చల్లారిన తర్వాత వాటిని మిక్సర్‌లో వేసి, ఆ తర్వాత వడగట్టి చిక్కటి పాలను తీశారు. పావుకిలో రాగుల నుంచి ఏకంగా 1100 మిల్లీలీటర్ల పాలు రావడం విశేషం.

ఐస్‌క్రీమ్ తయారీ: ఈ రాగి పాలకు ఐస్‌క్రీమ్‌కు అవసరమైన చక్కెర, వెనీలా, చాక్లెట్ వంటి ఫ్లేవర్లను, సహజమైన రంగులను జోడించారు. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి గడ్డకట్టించారు.

ఫలితంగా, 50 మిల్లీలీటర్ల పరిమాణం గల 20 రుచికరమైన, ఆరోగ్యకరమైన వీగన్ ఐస్‌క్రీమ్‌లు సిద్ధమయ్యాయి.

తక్కువ ఖర్చు.. తిరుగులేని రుచి : ఈ ప్రయోగం కేవలం వినూత్నంగా ఉండటమే కాదు, ఆర్థికంగా కూడా ఎంతో ప్రయోజనకరం. పావుకిలో రాగులు, ఇతర పదార్థాలు, విద్యుత్ ఖర్చు అన్నీ కలిపినా 20 ఐస్‌క్రీమ్‌ల తయారీకి కేవలం రూ.250 మాత్రమే ఖర్చయిందని నవీన్ తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా దీనిని తయారు చేయడం మరో ప్రత్యేకత. ఈ ఆవిష్కరణకు పేటెంట్ కోసం దరఖాస్తు చేయనున్నందున, తయారీలోని పూర్తి రహస్యాలను వెల్లడించలేమని ఆచార్యులు సూచించినట్లు నవీన్ పేర్కొన్నారు. సహ విద్యార్థులు, ప్రొఫెసర్లు రుచి చూసి, ఈ సరికొత్త ఐస్‌క్రీమ్‌ను ఎంతగానో ప్రశంసించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News