HomeతెలంగాణUniversity : పట్టాతో పాటు 'పట్టు'.. పీయూ నైపుణ్యాల తోట! ఏఐ శిక్షణతో కొలువుల వేట!

University : పట్టాతో పాటు ‘పట్టు’.. పీయూ నైపుణ్యాల తోట! ఏఐ శిక్షణతో కొలువుల వేట!

AI-integrated skill development for higher education : డిగ్రీ పట్టా చేతిలో ఉంది.. మార్కుల జాబితాలో మెరిసే అంకెలు ఉన్నాయి.. కానీ, ఇంటర్వ్యూ గదిలోకి వెళ్లగానే గొంతు పెగలడం లేదు. సాఫ్ట్‌వేర్ రంగం నుంచి ఫార్మా వరకు కంపెనీలు అడుగుతున్న సాంకేతిక ప్రశ్నలకు సమాధానాలు దొరకడం లేదు. ఇదీ నేటి సగటు పట్టభద్రుడి ఆవేదన. కేవలం చదువు ఉంటే సరిపోదు, ఆ చదువుకు ‘నైపుణ్యం’ తోడవ్వాలి. విద్యార్థుల ఈ లోటును భర్తీ చేస్తూ, వారిని రేపటి తరం శ్రామికశక్తిగా తీర్చిదిద్దేందుకు పాలమూరు విశ్వవిద్యాలయం (PU) ఒక విప్లవాత్మక అడుగు వేసింది.

- Advertisement -

తెలంగాణలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (AI) సహకారంతో ‘వ్యూహాత్మక నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం’ను పట్టాలెక్కించింది. అసలు ఈ క్లౌడ్ ప్లాట్‌ఫాం ప్రత్యేకత ఏంటి? వేలాది మంది విద్యార్థులు ఒకేసారి ఎక్కడి నుంచైనా ఎలా శిక్షణ పొందుతున్నారు? ఉద్యోగ వేటలో ఈ ‘ఐఏ’ అస్త్రం విద్యార్థులకు ఎలా రక్షణ కవచంగా మారుతోంది? ఈ అద్భుత ప్రక్రియపై ప్రత్యేక కథనం..

డిజిటల్ విప్లవం: ఒకే క్లౌడ్.. వేలాది కలలు : పాలమూరు యూనివర్సిటీ తన పరిధిలోని 35,824 మంది విద్యార్థులను ఒకే గొడుగు (Digital Platform) కిందకు చేర్చింది. ప్రతి విద్యార్థికి ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య (Unique Role Number), పాస్‌వర్డ్‌ను కేటాయించి క్లౌడ్ ప్లాట్‌ఫాంను అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘పీఎం ఉషా’ (PM-USHA) పథకం ద్వారా, టెలీకమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (TCIL) సహకారంతో ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇటువంటి అత్యాధునిక సాంకేతిక వేదికను ఏర్పాటు చేసిన తొలి వర్సిటీగా పాలమూరు చరిత్ర సృష్టించింది.

కోడ్‌తంత్ర ఏఐ: మీ జేబులోనే గురువు : ఈ ప్లాట్‌ఫాం కేవలం పాఠాలు చెప్పే వేదిక కాదు, అదొక మేధోమథన కేంద్రం. ‘కోడ్‌తంత్ర ఏఐ’ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులు తమ సందేహాలను ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా నివృత్తి చేసుకోవచ్చు.
AI వాయిస్ సపోర్ట్: విద్యార్థులకు అర్థమయ్యేలా వినసొంపైన కృత్రిమ మేధ గొంతుతో సమాచారం అందుతుంది.
విషయ పరిజ్ఞానం: ఐటీ కోడింగ్ నుంచి ఫార్మాస్యూటికల్ మెళకువల వరకు అన్నీ ఇక్కడ లభిస్తాయి.
స్వీయ అంచనా: విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో ఎప్పటికప్పుడు గ్రాఫ్ రూపంలో విశ్లేషిస్తుంది.

పరిశ్రమల అవసరాలే ప్రామాణికంగా : నేటి కార్పొరేట్ ప్రపంచంలో ‘పుస్తకాల్లో చదివింది – ఆఫీసులో చేసే పని’ మధ్య చాలా అంతరం ఉంటోంది. ఈ దూరాన్ని తగ్గించేందుకు పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా శిక్షణాంశాలను రూపొందించారు.

కమ్యూనికేషన్ నైపుణ్యాలు: ఇంటర్వ్యూల్లో ఎలా మాట్లాడాలి?
నాయకత్వ లక్షణాలు: ఒక బృందాన్ని (Team) ఎలా నడిపించాలి?
సాంకేతిక నైపుణ్యం: అత్యాధునిక సాఫ్ట్‌వేర్ టూల్స్ పై పట్టు సాధించడం.
గ్రూప్ డిస్కషన్స్: సమూహ చర్చల్లో సమయస్ఫూర్తిని ఎలా ప్రదర్శించాలి?

ఉద్యోగ మార్గదర్శిగా పీయూ : రిజిస్ట్రార్ రమేష్ బాబు మాటల్లో చెప్పాలంటే.. “ఈ వ్యవస్థ విద్యార్థులకు ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. ఒక ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఆ కంపెనీ ప్రొఫైల్ నుంచి అక్కడ అడిగే ప్రశ్నల వరకు AI పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. ఆడియో ఫార్మాట్‌లో వివరాలను విడమరిచి చెప్పడం వల్ల విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపన పెరుగుతోంది.”

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News