Panchayat elections in AP soon Parties are working towards victory: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల పోరు నడుస్తోంది. గ్రామాల్లో ఎక్కడ చూసినా సర్పంచ్ ఎన్నికల హడావుడే కనిపిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కసరత్తు ప్రారంభించింది. అ మేరకు, ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ కమిషనర్ నీలం సాహ్ని సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల పదవీకాలం ముగుస్తుండడంతో ఎన్నికల నిర్వహణకు కసరత్తు చేస్తోంది. కాగా, ఏపీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పదవీకాలం మార్చిలో ముగియనుండగా ఏప్రిల్‌తో సర్పంచ్‌ల పదవీకాలం ముగియనుంది. మరోవైపు, గ్రామ పంచాయతీల విభజన, మార్పులు చేర్పులకు కూటమి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల విభజన, పునర్నిర్మాణంపై నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం 2026 మార్చి నాటికి ముగియనుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఇటీవల లేఖ రాశారు. గ్రామ పంచాయతీ విభజనపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయాలని లేఖలో స్పష్టం చేశారు. అయితే, ఎన్నికల సంఘం కమిషనర్ రాసిన లేఖపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి, గ్రామ పంచాయతీల విభజనపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేసింది.
పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక మార్పులు..
ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఒక పంచాయతీని రెండుగా విభజించడం, ఒక పంచాయతీలో ఉన్న గ్రామాలను మరో పంచాయతీలో కలపడం లేదా రెండు పంచాయతీలను విలీనం చేయడం వంటివి చేసే అవకాశం ఉంటుంది. మరోవైపు, పంచాయతీలను పుర, నగరపాలక సంస్థల్లో కలపడం వంటివి కూడా చేయడానికి వీలు కలుగుతుంది. అయితే, ఈ మార్పులు చేయాలంటే పాలకవర్గ సభ్యులు తీర్మానాలు చేయాల్సి ఉంటుంది. పాలకవర్గం లేని పంచాయతీల్లో స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో గ్రామసభలు నిర్వహించి తీర్మానాలను ఆమోదించాల్సి ఉంటుంది. ఇలా పంచాయతీల్లో ఆమోదించిన తీర్మానాలను సంబంధిత జిల్లా కలెక్టర్లు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ కార్యాలయానికి అందజేస్తారు. ఆ తర్వాత పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి కార్యాలయానికి అక్కడి నుంచి ప్రభుత్వ ఆమోదానికి ఆ తీర్మానాలు వెళ్తాయి. అయితే, ఒక మండలంలో ఉన్న గ్రామ పంచాయతీలను మరో మండలంలో కలపడానికి వీల్లేదు. మరోవైపు, కూటమి ప్రభుత్వం పంచాయతీ రాజ్ వ్యవస్థలో కీలక సంస్కరణలు చేసేందుకు సిద్ధమవుతోంది. అందులో భాగంగానే ఇటీవల క్లస్టర్ల విధానాన్ని తొలగించారు. ఇప్పటివరకు ఉన్న 7,244 క్లస్టర్ల స్థానంలో 13,351 గ్రామ పంచాయతీలను స్వతంత్ర పరిపాలనా యూనిట్లుగా పేర్కొన్నారు. దీంతో ప్రతి పంచాయతీలోనూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, గ్రామీణ ప్రణాళిక, వీధి దీపాలు, ఇంజినీరింగ్, ఆదాయం, పన్ను వసూళ్లు వంటి విభాగాలు ఉంటాయి. ఇందుకు సంబంధించిన మార్పులు, చేర్పుల అమలుకు ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

