Phone tapping case: ఫోన్ల అక్రమ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు, సస్పెన్షన్‌లో ఉన్న పోలీస్ అధికారి దుగ్యాల ప్రణీత్‌రావుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. ఆయనకు గతంలో దక్కిన డీఎస్పీ పదోన్నతిని రద్దు చేస్తూ రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డీఎస్పీగా ప్రొబేషన్ కాలంలోనే అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తేలడంతో.. ఆయన్ను తిరిగి ఇన్‌స్పెక్టర్ హోదాకు తగ్గిస్తూ హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సి.వి.ఆనంద్ ఉత్తర్వులు ఇచ్చారు.
అసలు వివాదం ఏమిటి?: సాధారణంగా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో విశేష ప్రతిభ కనబరిచిన అధికారులకు మాత్రమే ‘యాక్సిలరేటెడ్ ప్రమోషన్’ (అత్యవసర పదోన్నతి) కల్పిస్తారు. అయితే 2007 ఎస్సై బ్యాచ్‌లో 300 మంది ఉన్నప్పటికీ.. ఎలాంటి సాహసోపేత చర్యలు చేయని ప్రణీత్‌రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించడం అప్పట్లో పెద్ద దుమారమే రేపింది. కేవలం ఫోన్ల ట్యాపింగ్ కోసం అప్పటి ప్రభుత్వం ఆయన్ను అందలం ఎక్కించిందనే విమర్శలు వెల్లువెత్తాయి.
సిట్ దర్యాప్తులో బయటపడిన కీలక వాస్తవాలు: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (SIB)లో పనిచేసిన కాలంలో ప్రణీత్‌రావు సాగించిన అరాచకాలు దర్యాప్తులో వెలుగుచూశాయి. 2023 ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజు (డిసెంబరు 4) ఎస్‌ఐబీలోని సీసీ కెమెరాలను ఆపివేసి.. 42 హార్డ్‌డిస్క్‌లను, ల్యాప్‌టాప్‌లను ధ్వంసం చేయడంలో ఈయన కీలక పాత్ర పోషించారు. ప్రొబేషనరీ కాలంలోనే సర్వీస్ రూల్స్ ఉల్లంఘించి అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు డీజీపీ నివేదిక ఇచ్చారు. దీంతో 2024 మార్చిలో ఈయనపై పంజాగుట్ట ఠాణాలో కేసు నమోదు కాగా అరెస్ట్ అయి జైలుకు వెళ్లారు.
Also read-Harish Rao: ఫోన్ ట్యాపింగ్ అంశంపై సజ్జనార్ ట్వీట్.. ఆగ్రహం వ్యక్తం చేసిన హరీశ్ రావు!
ఇకపై ఇన్‌స్పెక్టర్‌గానే: డీఎస్పీగా పదోన్నతి పొందిన ఏడాది తిరగకముందే తీవ్రమైన అభియోగాలు ఎదుర్కోవడంతో, ఆయనకు కల్పించిన యాక్సిలరేటెడ్ ప్రమోషన్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. దీనివల్ల ప్రణీత్‌రావు ఇకపై కేవలం ఇన్‌స్పెక్టర్ హోదాలోనే కొనసాగుతారు. సర్వీస్ నిబంధనల ప్రకారం ప్రొబేషనరీ పీరియడ్‌లో సత్ప్రవర్తన లేకపోతే పదోన్నతిని వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

