KCR- SIT Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారిస్తున్నారు. కాగా, నందినగర్‌లోని నివాసంలో ఉద్యమ వ్యూహాలు రచించిన గదిలోనే తనను విచారిస్తుండటంతో కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ నేపథ్యంలో గులాబీ బాస్ ఇంటి వద్ద పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read: https://teluguprabha.net/business/big-relief-on-medicines-solar-alcohol-to-cost-more/
రాష్ట్రంలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక దశ కొనసాగుతోంది. ఇప్పటికే బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్).. నేడు పార్టీ అధినేత కేసీఆర్‌ను విచారిస్తోంది. బంజారాహిల్స్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభం అయింది. రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను విచారించడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గున మండిపడుతున్నాయి. దీంతో నందినగర్‌లో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు మోహరించారు. కాగా, విచారణకు ముందు కేసీఆర్ భావోద్వేగానికి గురైనట్లుగా తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సాధనకు వ్యూహాలు రచించిన గదిలోనే ప్రస్తుతం విచారణ ఎదుర్కోవాల్సి రావడం తనను తీవ్రంగా బాధిస్తోందని గులాబీ బాస్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: https://teluguprabha.net/national-news/income-tax-reforms-2026-new-tax-law-april-1/
స్వరాష్ట్ర సాధన కోసం ఇదే గదిలో ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని విచారణకు ముందు కేసీఆర్ తెలిపినట్లుగా సమాచారం. ఇదే గదిలో కీలక చర్చలు జరిపానని.. అలాంటి చోట ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదని కేసీఆర్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. కాగా, విచారణ సమయంలో న్యాయవాదులను సిట్ అధికారులు అనుమతించలేదు. నిబంధనల ప్రకారం వారిని అనుమతించేందుకు అధికారులు నిరాకరించారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభం కాగానే.. హరీశ్ రావుతో, ఇతర నేతలనూ బయటకు పంపించారు.

