SIT Reply to KCR: ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సిట్‌కు కేసీఆర్ లేఖ రాయడంతో.. ఆ లేఖపై అధికారులు స్పందించారు.
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) అధికారులు బీఆర్‌ఎస్ కీలక నేతలను విచారించింది. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులను విచారించిన సిట్.. ఈ రోజు ఆ పార్టీ అధినేత, నందినగర్‌లో మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు పంపింది. శుక్రవారం విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా, ఈ నోటీసులపై స్పందించిన కేసీఆర్.. సిట్‌కు లేఖ రాశారు. రేపు సిట్‌కు విచారణకు హాజరు కాలేనని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికలు ఉన్నందున సమయం కోరిన కేసీఆర్.. విచారణ వాయిదా వేయాలని కోరారు. విచారణకు మరింత సమయం కోరిన కేసీఆర్.. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లోనే తనను విచారించాలని విజ్ఞప్తి చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని లేఖలో తెలిపారు. ఈ లేఖపై సిట్ అధికారులు స్పందించారు.
విచారణకు సమయం ఇవ్వాలనే కేసీఆర్ విజ్ఞప్తిని సిట్ అంగీకరించింది. దీంతో తేదీ, విచారణ ప్రదేశంపై న్యాయ సలహా తీసుకుని మరో నోటీసు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో తదుపరి సిట్ విచారణ తేదీపై సస్పెన్స్ కొనసాగుతోంది.
కాగా, కేసీఆర్‌కు సిట్ నోటీసులపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఇదంతా రాజకీయ కక్షే అంటూ దుయ్యబట్టాయి. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడమంటే సూర్యుడిపై ఉమ్మినట్లే అని హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా ఇంకా గట్టిగా కొట్లాడతామని హెచ్చరించారు.

