PM Narendra Modi: బెంగాల్ విజయోత్సవం తెలంగాణలో కనిపిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణలో అందరి నోటా ఒకటే మాట వినిపిస్తోందని.. ఇక్కడ కూడా బీజేపీ సర్కార్ ఏర్పడాలని ప్రజలు కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసగించారు. ఈ సందర్భంగా తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ.. ‘నా ప్రియమైన తెలంగాణ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు.’ అంటూ మాట్లాడారు.
బెంగాల్‌లో తొలిసారి బీజేపీ సీఎం ప్రమాణస్వీకారం చేశారని మోదీ పేర్కొన్నారు. భారీ మెజార్టీతో బెంగాల్‌లో బీజేపీ గెలిచిందని.. బెంగాల్ విజయోత్సవం తెలంగాణలో కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. అసోంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుందని.. పుదుచ్చేరిలోనూ NDA రెండోసారి అధికారంలోకి వచ్చిందని తెలిపారు. ప్రతి ఏటా దేశంలో ఏదో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని.. ఎన్నికల్లో కొందరు గెలుస్తారు, కొందరు ఓడుతారని మోదీ అన్నారు. కానీ ఈ సారి జరుగుతున్న చర్చ ఎప్పుడూ జరగలేదని.. బెంగాల్‌లో బీజేపీ గెలుపుతో బానిస సంకెళ్లు తొలిగాయని మోదీ వ్యాఖ్యానించారు.
‘మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తానాషాహీ మోడల్‌తో ప్రజలను ఇబ్బంది పెట్టింది. బెంగాల్ ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛావాయువు పీల్చుకుంటున్నారు. పదేళ్ల క్రితం బెంగాల్‌లో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇప్పుడు 200 మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్లో బీజేపీకి ఇద్దరు ఎంపీలు మాత్రమే ఉండేవారు. అందులో ఒకరు తెలంగాణ వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కూడా భారీ మెజార్టీతో గెలుస్తాం. దేశంలో 14 ఇండస్ట్రియల్ కారిడార్ల పనులు జరుగుతున్నాయి. అందులో ఒకటి జహీరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నాం. -ప్రధాని మోదీ
Also Read: https://teluguprabha.net/national-news/prime-minister-modi-visits-chandrababu-and-pawan-residences/
మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉందని.. ఆ పార్టీ ఎక్కడున్నా ఒకటే మోడల్ అని ప్రధాని మోదీ దుయ్యబట్టారు. ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇస్తారని.. ఆ తర్వాత సాకులు వెతుకుతారని ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ కుటుంబ పార్టీలేనని మోదీ విమర్శించారు. తెలంగాణలో కూడా ఇదే జరుగుతోందని మండిపడ్డారు.
‘కాంగ్రెస్ విద్వేష రాజకీయాలను రెచ్చగొడుతోంది. ఆ పార్టీ MMCగా మారింది. MMC అంటే ముస్లిం లీగ్ మావోవాది కాంగ్రెస్. మావోయిస్టులతో తెలంగాణ తీవ్రంగా నష్టపోయింది. ఇక్కడ కాంగ్రెస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడుతున్నారు. కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మావోయిస్టులకు అండగా ఉన్నాయి. మావోయిస్టులు తమ అంతిమ శ్వాసను లెక్కబెట్టుకుంటున్నారు. మావోయిస్టులపై చర్యలు తీసుకోడానికి కాంగ్రెస్ ముందుకు రాలేదు. తెలంగాణ పోలీసులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చి ఉంటే మావోయిస్టులను అణిచివేసేవారు. ఇప్పుడు తెలంగాణ మావోయిస్టురహితంగా మారుతోంది.’- ప్రధాని మోదీ

