Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లాలో పోలీసులకు, రైతులకు మధ్య జరిగిన తోపులాట ఘటనను నిరసిస్తూ నేడు కవిత పరిగి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. బుధవారం (ఏప్రిల్ 15) వందలాది మంది రైతులతో కలిసి ఆమె ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు.
రైతులు పోలీసుల మధ్య తోపులాట
అయితే, పోలీసులు భారీగా మోహరించి రైతులను అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో ధర్నా నిర్వహిస్తున్న కవితను పోలీసులు అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేయగా.. రైతులు, కార్యకర్తలు పోలీసులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గంటల తరబడి తోపులాట జరిగింది. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో పోలీసులు కవితను బలవంతంగా వాహనం నుంచి కిందకు దించి, ఎన్టీఆర్ చౌరస్తా మీదుగా తరలించారు. ఆమె వాహనాన్ని కూడా అక్కడి నుంచి వేరే ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
మా పోరాటం ఆపం
అరెస్టుకు ముందు కవిత మాట్లాడుతూ.. ‘రైతుల పొట్ట కొట్టి పరిశ్రమలు కట్టడం ఏంటి’ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు ప్రాణాలకు తెగించి తమ భూములను కాపాడుకుంటుంటే వారిపై లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూసేకరణ నోటిఫికేషన్ రద్దు చేసే వరకు బీఆర్ఎస్ పోరాటం ఆపదని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం కవిత అరెస్టుతో వికారాబాద్‌లో ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎక్కడికక్కడ జాగృతి శ్రేణులు రాస్తారోకోలు చేపట్టడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. శాంతిభద్రతల దృష్ట్యా జిల్లా కేంద్రంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

