బూర్గంపాడు, అక్టోబర్ 2 (తెలుగు ప్రభ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం జింకలగూడెంలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఎస్పీ రోహిత్‌రాజ్ ఆదేశాలతో పాల్వంచ డీఎస్పీ సతీష్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. గ్రామంలోని ప్రతి ఇంటినీ తనిఖీ చేసి అనుమానితులు, అసాంఘిక కార్యకలాపాలపై ఆరా తీశారు. సరైన పత్రాలు లేని 40 వాహనాలను గుర్తించి సీజ్ చేశారు.
ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఎవరైనా గంజాయి సేవించడం, అక్రమంగా రవాణా చేయడం, పశువుల అక్రమ రవాణాకు పాల్పడటం వంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాలను విశ్వసించవద్దని, వాటి పేరుతో ఎవరినీ హింసించవద్దని తెలిపారు. వాహనదారులు తమ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలను కలిగి ఉండాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించాలని సూచించారు.
ఈ కార్డెన్ అండ్ సెర్చ్‌లో పాల్వంచ సీఐ సతీష్, బూర్గంపాడు మండల ఎస్‌ఐలు ప్రసాద్, నాగభిక్షం, రామ్మూర్తి, పాల్వంచ టౌన్ ఎస్‌ఐలు నాగరాజు, విజయ, పాల్వంచ రూరల్ ఎస్‌ఐ సురేష్, ములకలపల్లి ఎస్‌ఐ మధుప్రసాద్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది పాల్గొన్నారు.

