Polycet Students must follow these steps: తెలంగాణలోని వివిధ ఇంజినీరింగ్ కళాశాల్లో లేటరల్ ఎంట్రీ ద్వారా బీఈ/బీటెక్ ప్రవేశాల కోసం సాంకేతిక విద్యా మండలి ఏటా నిర్వహించే పాలిసెట్-2026 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఖమ్మం జిల్లా పాలిసెట్ పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్ ఎన్. గోపి మీడియా సమావేశంలో తెలియజేశారు. ఖమ్మంలోని జలగం వెంగళరావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 500 మంది, బండి శోభనాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 200 మంది, ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 183 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని తెలిపారు. మొత్తం మూడు పరీక్షా కేంద్రాల్లో 883 మంది విద్యార్థిని, విద్యార్థులు బుధవారం నిర్వహించే పాలిటెక్నిక్ పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.
విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలివే..
పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ హాల్ టికెట్‌తో పాటు హెచ్‌బీ పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, బ్లూ లేదా బ్లాక్ బాల్‌పాయింట్ పెన్, పరీక్షా ప్యాడ్ వెంట తీసుకురావాలని ఆయన సూచించారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ వాచీలు పరీక్షా కేంద్రంలోకి అనుమతి లేదని తెలిపారు. విద్యార్థులు ఉదయం 10 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని, ఉదయం 11 గంటల తర్వాత వచ్చిన విద్యార్థులను పరీక్షకు అనుమతించబోమని స్పష్టం చేశారు. హాల్‌టికెట్‌పై తమ ఫొటోలు సరిగా ప్రింట్ అవ్వని వారు.. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు ఆధార్ కార్డు వెంట తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లో మంచినీటి సదుపాయం, ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, విద్యార్థిని, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షలు సజావుగా జరిగేందుకు సహకరించాలని కోరారు. పరీక్ష కేంద్రానికి ముందే చేరుకోవాలని సూచించారు.

