Ponguleti makes key announcement on Indiramma houses: గుడిసెలు లేని తెలంగాణే లక్ష్యమని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. బుధవారం హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలు, గుడిసెల గుర్తింపు, రూఫ్ రీప్లేస్‌మెంట్ స్కీమ్ తదితర అంశాలపై మంత్రి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం కూడా గుడిసెల్లో నివసించకుండా.. గౌరవప్రదంగా జీవించేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గుడిసెలను యుద్ధప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం వద్ద ఇప్పటికే ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధ్రువీకరించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారని.. ఆ దరఖాస్తులన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించాలన్నారు.
Also read: TG Pensions: షాకింగ్ న్యూస్.. ఒకేసారి 1.28 లక్షల పెన్షన్లు రద్దు.. మీ పేరు ఉందేమో చూసుకోండి..!
రెండో విడతలో నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు..
రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2వేల ఇళ్ల చొప్పున అర్హులను గుర్తించాలిన, ఎంపికను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని కోరారు. పేదల నివాస భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నామన్నారు. రెండో విడతలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 500 ఇళ్ల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇళ్లను ఈ పథకం కింద ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. గోడలు, పునాదులు బలంగా ఉన్నప్పటికీ పైకప్పులు టార్పాలిన్ షీట్లు, రేకులు, నాపరాళ్లు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పైకప్పుల కింద నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి వారికి ఆర్‌సీసీ స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. గతంలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు.

