Ponguleti Srinivasa Reddy press meet : రాష్ట్రంలో ప్రజా పాలన అభివృద్ధి, సంక్షేమమే జోడెడ్లుగా పరుగులు తీస్తోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉద్ఘాటించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినా, ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించి పేదలకు సంక్షేమ ఫలాలను అందిస్తున్నామని స్పష్టం చేశారు. రాహుల్‌గాంధీపై కేటీఆర్ సంస్కారహీనంగా మాట్లాడితే ప్రజలు క్షమించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
రైతాంగానికి భరోసా – రికార్డు సంక్షేమం: ‘వరి వేస్తే ఉరే’ అన్న గత పాలకుల విధానాలకు చరమగీతం పాడుతూ రైతులకు బోనస్ ఇచ్చి తెలంగాణను వరి సాగులో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపామని, రైతులకు రూ.1.74 లక్షల కోట్లు అందించామని మంత్రి తెలిపారు. పదేళ్లపాటు పేదలకు రేషన్ కార్డులు ఇవ్వని దుస్థితి నుంచి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 15 లక్షల కొత్త కార్డులను మంజూరు చేసిందని వివరించారు. ఎక్కడో అడవుల్లో కాకుండా ఖరీదైన ప్రాంతాల్లో నిరుపేదల కోసం ‘ఇందిరమ్మ టవర్లు’ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు.
ధరణి అక్రమాలకు చెక్ – కేసీఆర్ రాజీనామా చేయాలి: ధరణి పోర్టల్ లోపాలను, 22ఏ అక్రమాలను ‘భూభారతి’ ద్వారా సరిదిద్దుతూ నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేస్తున్నామని వెల్లడించారు. బీఆర్‌ఎస్ హయాంలో హైదరాబాద్ భూములను అడ్డగోలుగా అనుయాయులకు కట్టబెట్టారని మండిపడ్డారు. ప్రజల సొమ్ముతో జీతభత్యాలు తీసుకుంటూ అసెంబ్లీకి రాని కేసీఆర్, తక్షణమే ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత పదవులకు రాజీనామా చేసి గౌరవం కాపాడుకోవాలని మంత్రి పొంగులేటి హితవు పలికారు.

