Prajavani: ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలకే పరిమితమైన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని.. ఇకపై మరింత విస్తరించి రాష్ట్రవ్యాప్తంగా మండల స్థాయిలో కూడా నిర్వహించాలని నిర్ణయించింది.
ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి: ఇక నుంచి ప్రతి సోమవారం ఉదయం 10:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు మండల కేంద్రాల్లోని ఎంపీడీవో కార్యాలయాల్లో ‘ప్రజావాణి’ కార్యక్రమం కొనసాగుతుంది. ఇప్పటివరకు చిన్న చిన్న సమస్యల కోసం కూడా గ్రామీణ ప్రాంత ప్రజలు జిల్లా లేదా రాష్ట్ర కేంద్రాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఆ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. నేరుగా తమ మండల కేంద్రంలోనే అధికారులకు వినతిపత్రాలు సమర్పించే అవకాశం లభించనుంది. ప్రజల నుంచి స్వీకరించే ఫిర్యాదులు మరియు వినతులను వెంటనే ‘ప్రజావాణి’ పోర్టల్‌లో నమోదు చేస్తారు. అనంతరం వాటిని సంబంధిత శాఖలకు పంపి, నిర్దిష్ట కాలవ్యవధిలో సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతారు. ఈ కొత్త విధానం ద్వారా ప్రజల సమస్యల పరిష్కారం మరింత వేగవంతం కావడంతో పాటు పరిపాలనలో జవాబుదారీతనం మరింత పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.
Also Read-Harish Rao: టీపీసీసీ చీఫ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

