HomeతెలంగాణProperty Tax : క్యూర్‌లో ఆస్తి పన్ను మోత

Property Tax : క్యూర్‌లో ఆస్తి పన్ను మోత

  • పది శాతం పరిమితి దేనిపై?
  • పన్ను నిర్ణయంపై కరువైన స్పష్టత
  • ముంబై, బెంగుళూరు తరహా విధానం
  • పేదలు, అద్దెలపై జీవించేవారికి దక్కని భరోసా
  • పాత ఇళ్ల విలువ నిర్ణయంపైనా లేని స్పష్టత

హైదరాబాద్, సెప్టెంబర్ 13(తెలుగుప్రభ): హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ (క్యూర్‌) బిల్లుకు అసెంబ్లీ ఆమోదం లభించడంతో ఆస్తిపన్నుపై ఆందోళనలు మొదలయ్యాయి. ప్రస్తుత వార్షిక అద్దె ఆధారిత విధానానికి బదులుగా ఆస్తి మూలధన విలువ (క్యాపిటల్‌ వాల్యూ) ఆధారంగా పన్ను విధించే అవకాశం ఉంది. పన్ను పెంపును గరిష్ఠంగా 10 శాతానికి పరిమితం చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. ఆ 10 శాతం ఏ ప్రాతిపదికన అన్నదానిపై స్పష్టత లేదు. ప్రాంతాల వారీగా ఆస్తి విలువను నిర్ణయిస్తే విలాసవంతమైన కాలనీలు, మురికివాడలు ఒకే ప్రాంతంలో ఉన్న సందర్భాల్లో అందరికీ ఒకే విలువ వర్తించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పాత ఇళ్లకు వయసు ఆధారంగా లభించే రాయితీలపైనా బిల్లులో స్పష్టత లేదు. వారసత్వంగా వచ్చిన ఇళ్ల అద్దెలపై ఆధారపడే రిటైర్డ్‌ ఉద్యోగులు, పేదలు, మధ్యతరగతి వర్గాలపై భారం పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. క్యూర్‌ పరిధిలో నోటరీలపై ఉన్న ఇళ్లకు పన్ను ఎలా నిర్ణయిస్తారన్నదీ తేలాల్సి ఉంది.

- Advertisement -

విలువ పెరిగితే.. పన్నూ పెరుగుతుందా?
ముంబైలో రెడీ రెకనర్‌, బెంగళూరులో యూనిట్‌ ఏరియా వ్యాల్యూ విధానాల్లో ఆస్తి విలువను ఆధారంగా చేసుకుని పన్ను లెక్కిస్తున్నారు. ఆయా నగరాల్లో చిన్న ఇళ్లు, పేదల నివాస ప్రాంతాలకు ప్రత్యేక రాయితీలు ఉన్నాయి. ముంబైలో 500 చదరపు అడుగుల వరకు ఉన్న నివాస యూనిట్లకు మినహాయింపులు ఉన్నాయి. క్యూర్‌ బిల్లులో ఇలాంటి రక్షణలపై స్పష్టత లేకపోవడమే ప్రధాన ఆందోళనగా మారింది. ఆస్తి మార్కెట్‌ విలువ పెరిగితే యజమాని ఆదాయం పెరగకపోయినా పన్ను పెరిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చదరపు అడుగు విలువ రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెరిగితే, అదే పెరిగిన విలువ ఆధారంగా పన్ను లెక్కించే పరిస్థితి రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

10 శాతం.. దేనిపై?
ప్రస్తుతం రూ.10 వేల ఆస్తిపన్ను చెల్లిస్తున్న వారికి 10 శాతం పెంపు అంటే రూ.11 వేలు అవుతుంది. అయితే ఆస్తి విలువ ఆధారంగా కొత్తగా పన్ను మదింపు చేస్తే రూ.15 వేలు, రూ.20 వేలు కూడా చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చన్న ఆందోళన ఉంది. అందువల్ల 10 శాతం పరిమితి ప్రస్తుత పన్నుపైనా, కొత్తగా నిర్ణయించే మదింపు మొత్తంపైనా అన్నది ప్రభుత్వం స్పష్టం చేయాల్సి ఉంది. ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పన్ను విధానం పాత విలువలపైనే ఆధారపడటంతో నగర అభివృద్ధికి అనుగుణంగా స్థానిక సంస్థల ఆదాయం పెరగడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. మున్సిపల్‌ సంస్థలను ఆర్థికంగా స్వయం సమృద్ధి చేయడమే కొత్త విధానం ఉద్దేశమని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే పన్ను భారం సామాన్యులపై పడకుండా పేదలు, చిన్న ఇళ్లు, పాత ఆస్తులకు స్పష్టమైన రక్షణలు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News