35 ఏళ్లలో ప్రపంచవ్యాప్తంగా 22.8 శాతం పెరిగిన వ్యాధి ప్రాబల్యం
మహిళలు, వృద్ధుల్లో అధిక ప్రభావం.. ప్రారంభంలో గుర్తించడం కష్టమే
తెలంగాణలో వ్యాధి తీవ్రతపై ప్రత్యేక గణాంకాలు కరవు
వైద్య సేవలు, నిర్ధారణ సదుపాయాల బలోపేతం అవసరం
గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డీసీజ్ (జీడీబీ) అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 1 (తెలుగుప్రభ) : సాధారణంగా అధిక రక్తపోటు అనగానే శరీరంలోని రక్తనాళాల్లో ఒత్తిడి పెరగడమే గుర్తుకొస్తుంది. అయితే, ఊపిరితిత్తులకు రక్తాన్ని తీసుకెళ్లే ధమనుల్లో ఒత్తిడి అసాధారణంగా పెరగడాన్ని పల్మనరీ ఆర్టీరియల్ హైపర్‌టెన్షన్ (పీఏహెచ్) అంటారు. ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం, ఆయాసం, అలసటను సాధారణ సమస్యలుగా భావించడం వల్ల వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతోంది. సకాలంలో చికిత్స అందకపోతే గుండెపై ఒత్తిడి పెరిగి ప్రాణాపాయం ఏర్పడవచ్చు. గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ (జీబీడీ) అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి ప్రాబల్యం పెరుగుతున్నట్లు వెల్లడించాయి. ముఖ్యంగా మహిళలు, వృద్ధుల్లో ముప్పు అధికంగా ఉండగా, భారత్‌లో బాధితుల సంఖ్య రెట్టింపునకుపైగా పెరిగింది.
35 ఏళ్లలో పెరిగిన ప్రాబల్యం
1990 నుంచి 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా వయస్సు ఆధారంగా సర్దుబాటు చేసిన పీఏహెచ్ ప్రాబల్య రేటు 22.8 శాతం, కొత్త కేసుల రేటు 4 శాతం పెరిగాయి. ఇదే సమయంలో మరణాల రేటు 22.9 శాతం, వైకల్యం కారణంగా కోల్పోయిన ఆరోగ్యకరమైన జీవిత సంవత్సరాల రేటు 37.6 శాతం తగ్గాయి. 2021లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.92 లక్షల మంది ఈ వ్యాధితో బాధపడుతుండగా, 43,251 కొత్త కేసులు నమోదయ్యాయి. వ్యాధి కారణంగా 22,021 మంది మరణించారు. ప్రతి లక్ష మందికి 2.28 మంది ఈ వ్యాధి బారినపడుతున్నట్లు అంచనా. 2021లో ప్రతి లక్ష మంది మహిళల్లో 2.75 మందికి పీఏహెచ్ ఉండగా, పురుషుల్లో ఈ సంఖ్య 1.78గా నమోదైంది. మొత్తం బాధితుల్లో మహిళల వాటా సుమారు 62 శాతం. వయస్సు పెరిగేకొద్దీ వ్యాధి ప్రాబల్యం అధికమవుతోంది. వృద్ధుల్లో ఆయాసం, అలసటను వయస్సు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేసే అవకాశం ఉన్నందున గుండె, ఊపిరితిత్తుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించడం అవసరం.
భారత్‌లో రెట్టింపునకుపైగా బాధితులు
జీబీడీ – 2021 గణాంకాల ఆధారంగా నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. భారత్‌లో 1990లో సుమారు 10,592 మంది పీఏహెచ్ బాధితులు ఉండగా, 2021 నాటికి ఆ సంఖ్య 23,742కు చేరింది. ప్రతి లక్ష మందికి వ్యాధి ప్రాబల్య రేటు 1.62 నుంచి 1.74కు పెరిగింది. అయితే, కొత్త కేసుల రేటు 0.58 నుంచి 0.56కు, మరణాల రేటు 0.29 నుంచి 0.24కు తగ్గాయి. వైకల్యం కారణంగా కోల్పోయిన ఆరోగ్యకరమైన జీవిత సంవత్సరాల రేటు 11.73 నుంచి 7.75కు పడిపోయింది. 2021లో సుమారు 7,512 కొత్త కేసులు నమోదైనట్లు అంచనా. 30 నుంచి 74 ఏళ్ల మధ్యవారిలో వ్యాధి ప్రాబల్యం ఎక్కువగా ఉండగా, ఐదేళ్లలోపు చిన్నారుల్లో మరణాలు, వైకల్య భారం అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
తెలంగాణలో గణాంకాల కొరత
దేశవ్యాప్తంగా అంచనాలు అందుబాటులో ఉన్నప్పటికీ తెలంగాణలో పీఏహెచ్ బాధితుల సంఖ్య, జిల్లాలవారీ కేసులు, మరణాలు, చికిత్స వివరాలపై సమగ్ర గణాంకాలు లేవు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో నమోదయ్యే కేసులను ఒకే వ్యవస్థలో నమోదు చేసే ప్రత్యేక రిజిస్ట్రీ అవసరం కనిపిస్తోంది. గుండె, ఊపిరితిత్తుల వైద్య విభాగాల సమన్వయంతో ఈ వివరాలను సేకరిస్తే వ్యాధి తీవ్రత, చికిత్స ఫలితాలపై స్పష్టత వస్తుంది. ముఖ్యంగా పుట్టుకతో గుండె లోపాలున్న చిన్నారులు, దీర్ఘకాలిక గుండె, ఊపిరితిత్తుల సమస్యలున్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
ఆయాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు
పీఏహెచ్ ఉన్నవారికి కొద్దిపాటి శారీరక శ్రమకే ఆయాసం, అలసట రావచ్చు. మెట్లు ఎక్కడం, కొద్దిదూరం నడవడం కూడా కష్టమవుతుంది. వ్యాధి ముదిరితే ఛాతినొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, తలతిరగడం, స్పృహ కోల్పోవడం, కాళ్లు, పాదాలు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పెదవులు, వేళ్లు నీలిరంగులోకి మారడం కూడా తీవ్రమైన దశలో కనిపించవచ్చు. ఈ లక్షణాలను ఆస్తమా లేదా సాధారణ శ్వాసకోశ సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేయకూడదు. తరచూ ఆయాసం, అలసట ఉంటే వైద్యులను సంప్రదించాలి. ఎకోకార్డియోగ్రామ్ ద్వారా గుండె పనితీరు, ఊపిరితిత్తుల ధమనుల్లో ఒత్తిడి పెరిగే అవకాశాలను అంచనా వేస్తారు. అవసరాన్ని బట్టి ఈసీజీ, ఛాతీ ఎక్స్‌రే, ఊపిరితిత్తుల పనితీరు, రక్త పరీక్షలు నిర్వహిస్తారు. వ్యాధిని కచ్చితంగా నిర్ధారించేందుకు కుడివైపు గుండె కాథెటరైజేషన్ పరీక్ష కీలకం. దీని ద్వారా ఊపిరితిత్తుల ధమనుల్లో రక్తపోటును నేరుగా కొలుస్తారు. వ్యాధి రకం, తీవ్రతను బట్టి చికిత్స నిర్ణయిస్తారు. 2026లో భారతీయ వైద్య పరిస్థితులపై వెలువడిన పల్మనరీ వాస్క్యులర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఇండియా టాస్క్‌ఫోర్స్ నివేదిక.. నిర్ధారణలో జాప్యం, వైద్య సదుపాయాల కొరత, పరీక్షలు, చికిత్స ఖర్చులను ప్రధాన సవాళ్లుగా పేర్కొంది. ప్రత్యేక వైద్య కేంద్రాలు, సమగ్ర నిర్ధారణ విధానాలు, వైద్యులకు శిక్షణ అవసరమని సూచించింది.
2035 నాటికి తగ్గే అవకాశం
పరిశోధకుల అంచనాల ప్రకారం 2035 నాటికి పీఏహెచ్ కారణంగా కోల్పోయే ఆరోగ్యకరమైన జీవిత సంవత్సరాల రేటు సుమారు 31.8 శాతం తగ్గవచ్చు. వ్యాధి ప్రాబల్యం, మరణాల రేటు కూడా తగ్గే అవకాశముండగా, కొత్త కేసుల రేటు స్వల్పంగా పెరగవచ్చని అంచనా. అయినప్పటికీ చికిత్సా సదుపాయాల్లో ప్రాంతాల మధ్య అసమానతలు, ఖరీదైన పరీక్షలు, దీర్ఘకాలిక చికిత్స ఖర్చులు సవాళ్లుగా కొనసాగనున్నాయి. తెలంగాణలో ప్రత్యేక రిజిస్ట్రీ ఏర్పాటు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్ధారణ సదుపాయాల బలోపేతం, చిన్నారులకు ముందస్తు పరీక్షలు, బాధితులకు నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరం. రాష్ట్రస్థాయిలో సమగ్ర అధ్యయనం నిర్వహిస్తే వ్యాధి వాస్తవ భారాన్ని గుర్తించి తగిన వైద్య కార్యాచరణ రూపొందించవచ్చు.

