Hyderabada Drug Case: గ్రేటర్ హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు పబ్బులపై ఈగల్ బృందం మెరుపు దాడులు నిర్వహించింది. కొండాపూర్ ప్రాంతంలోని క్వాక్ ఎరీనా పబ్ లో తనిఖీలు నిర్వహించారు. ఆ పబ్‌లో డ్రగ్స్ వినియోగం జరుగుతోందన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు పబ్‌లోని ప్రతి ఒక్కరినీ తనిఖీ చేశారు. అనుమానితులకు అక్కడికక్కడే డ్రగ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో పలువురికి పాజిటివ్‌గా తేలింది.
64 మందికి పరీక్షలు
పాజిటివ్ వచ్చిన వారిలో ఐఏఎస్ అధికారిని కుమారుడు కూడా ఉన్నట్టు సమాచారం. మహిళా ఐఏఎస్ అధికారి కుమారుడు ఈ డ్రగ్స్ పార్టీలో దొరికిపోవడం రాష్ట్రం వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. పబ్‌లో జరిగిన సోదాల సమయంలో పోలీసులు ఎవరినీ వదలకుండా అనుమానితులకు డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. మొత్తం 64 మందికి పరీక్షలు చేయగా అందులో మహిళా ఐఏఎస్ కుమారుడికి డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. డ్రగ్స్ వినియోగించినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు అతడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇదే పబ్‌కి నటి హేమ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఆమె యూరిన్ శాంపుల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించకు తనకు నెగిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని హేమ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ వీడియో షేర్ చేసింది.
పాజిటివ్ వచ్చిన వారి వివరాలు..
పబ్‌లో పట్టుబడ్డ వారి వివరాలను పోలీసులు అధికారికంగా వెల్లడించారు. రితేష్, జ్యోతి రాదిత్య, రిత్విక్ వాసాల, అభిషేక్ వర్మ, అకెళ్ల హరిత్ సారంగ, రిషబ్ శ్రీవాత్సవ, పిట్ల పృథ్వి రాజ్, మోనిష్ సత్వానీలకు డ్రగ్స్ సేవించినట్లు పరీక్షల్లో తేలింది. వీరందరిపై తదుపరి విచారణ కొనసాగుతోంది. గచ్చిబౌలి పరిసరాల్లోని పబ్బులు డ్రగ్స్ విక్రయాలకు అడ్డాగా మారుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు నగరంలో కలకలం రేపుతున్నాయి.
కాగా పాజిటివ్ వచ్చిన ఐఏఎస్ కుమారుడితో పాటు మరో ఏడుగురిని పాజిటివ్ రాగా వారిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వీరిపై ఎన్డీపీఎస్ (NDPS) చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నిబంధనలు అతిక్రమించి డ్రగ్స్ పార్టీలు నిర్వహిస్తున్న పబ్ యాజమాన్యంపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Actress Hema: పబ్‌లో పట్టుబడ్డ నటి హేమ, మరోసారి డ్రగ్స్ టెస్ట్.. వీడియో వైరల్

