Rain Alert for Telangana: తెలంగాణలో మరోసారి వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: https://teluguprabha.net/national-news/mp-raghav-chadha-video-aap-counter/
ఈ రోజు ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జనగామ జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని పేర్కొంది. ఆదివారం ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, సిరిసిల్లతో పాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వర్షం కురిసే సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. వర్షం పడే సమయంలో చెట్ల కింద, విద్యుత్ వైర్ల సమీపంలో ఉండవద్దని సూచించింది.

