Ramdev Rao demans on Toddy Festival: కల్లును రాష్ట్ర పానియంగా గుర్తించాలని, కల్లు మీద ఉన్న ఆంక్షలను ఎత్తివేసి బార్లు, పబ్బులు, స్టార్ హోటళ్లలో అనుమతించాలని ఎక్స్ పీరియం పార్క్ ఫౌండ్, చైర్మన్ రామడుగు రామ్ దేవ్ రావు డిమాండ్ చేశారు. మే 24న నిర్వహించ తలపెట్టిన ‘టాడి మ్యూజిక్ ఫెస్టివల్’పై గౌడ సంఘం నేతల విమర్శలకు ఆయన స్పందించారు. శుక్రవారం పార్కులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతానికి ఫెస్టివల్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. వరంగల్ జిల్లా నెక్కొండకు చెందిన తాను ప్రకృతి ప్రేమికుడినని, చిన్నప్పటి నుంచి కల్లు తాగే పెరిగానన్నారు. తనపై విమర్శలు చేస్తున్న గౌడ సంఘం నేతలు కల్లు కాంపౌండ్లు మెయింటేన్ చేసేవాళ్లని, అందులో ఎంత కల్లు ఉంటుందో? అందరికీ తెలిసిందేనన్నారు. నెలకు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు సంపాదిస్తున్న వాళ్లు.. గ్రామాల్లో చెట్లెక్కి కల్లు గీస్తున్న కార్మికులు ఎంత సంపాదిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనకు ఏ స్వార్థం లేదని, ఎలాంటి లాభాపేక్ష లేదని కల్లుకు బ్రాండ్ క్రియేట్ చేసి గీత కార్మికులను అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. కల్లును ప్రపంచవ్యాప్తంగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ‘టాడి మ్యూజిక్ ఫెస్టివల్ ’ పెట్టామని వెల్లడించారు. పబ్బులు, బార్లు, స్టార్ హోటళ్లు, ఫంక్షన్లలో మల్టీ నేషనల్ కంపెనీలకు సంబంధించిన బ్రాండ్లు వేలు ఖర్చు పెట్టి తాగుతున్నారని, అందులో కెమికల్ తప్ప ఏమీ ఉండదన్నారు. మన దగ్గర 15 లక్షల మంది ఐటీ ఉద్యోగులు, వేల మంది బిజినెస్ మెన్లు ఉన్నారని, వాళ్లు ఏదైనా పార్టీ చేసుకోవాలంటే విస్కీ, బీరు, వైన్లను ఎంపిక చేసుకుంటున్నారని, వాటితో పాటు సహజసిద్ధమైన కల్లును కూడా ప్రమోట్ చేస్తే గీత కార్మికులు అభివృద్ధి చెందుతారన్నారు. నేచురల్‌గా దేవుడు ఇచ్చే కల్లును వాళ్లకు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
Also Read: SBI strike: వరుసగా 5 రోజులు బ్యాంకులు బంద్..!! కస్టమర్లకు ఎస్‌బీఐ బిగ్ అలర్ట్..!
కల్లుకు బ్రాండ్ క్రియేట్ చేయడమే లక్ష్యం..
టెక్నాలజీ యుగంలోనూ.. గీత కార్మికులు చెట్ల దగ్గరే కల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఐటీ, వ్యాపార వర్గాలు తాటి వనాల్లో కూర్చొని కల్లు తాగే అవకాశం ఉండదు. అందుకే కల్లును ‘చీప్ డ్రింక్’ గా ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్లుకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని, రాష్ట్ర పానీయంగా ప్రకటించాలని ప్రభుత్వ పెద్దలను కోరినట్లు తెలిపారు. తానేమీ కల్లు కాంపౌండ్ పెట్టడం లేదని, కల్లు పేరిట వ్యాపారం కూడా చేయడం లేదన్నారు. రూ.500 కోట్లతో ఎక్స్‌పీరియం పార్క్‌ను అభివృద్ధి చేశానని, 85 దేశాలు తిరిగి వేల రకాల చెట్లు తీసుకొచ్చి ఇక్కడ నాటామని తెలిపారు. ఇందులో వివిధ దేశాల నుంచి తెచ్చిన 280 రకాల తాటి, ఈత, జీలుగు చెట్లు ఉన్నాయని, ఒక ఎకరంలో 200 చెట్లు పెంచొచ్చన్నారు. జీలుగు చెట్ల ద్వారా 20 నుంచి 30 లీటర్ల వరకు కల్లు వస్తుందని, అయినప్పటికీ, తాము చెట్లను గీయమని, అవి కేవలం ప్రదర్శన కోసమే ఉంచామని వివరించారు. ఈ ప్రోగ్రామ్ వల్ల తనకు కనీసం లక్ష రూపాయల లాభం వస్తుందని ఎవరైనా నిరూపిస్తే వారికి పూలదండ వేసి కోటి రూపాయలు గిఫ్ట్‌గా ఇస్తానని సవాల్ చేశారు. గోవాలో ఫెని, నార్త్ ఈస్ట్‌లో రైస్ బీర్, మధ్యప్రదేశ్‌లో మహువా వంటి స్థానిక పానీయాలు గుర్తింపు పొందినట్లే, తెలంగాణ కల్లును కూడా ప్రపంచానికి పరిచయం చేయడమే తన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

