Homeతెలంగాణరంగారెడ్డిPD ACT: పండుగల వేళ రౌడీలకు పోలీసుల అల్టిమేటం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

PD ACT: పండుగల వేళ రౌడీలకు పోలీసుల అల్టిమేటం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు

రాజేంద్రనగర్ (తెలుగు ప్రభ): వినాయక చవితి, బోనాల పండుగల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అత్తాపూర్ పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించి కఠిన హెచ్చరికలు జారీ చేశారు. పండుగల సమయంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, చట్టం తన పని తాను చేసుకుంటుందని స్పష్టం చేశారు. 

- Advertisement -

నేరాలు వద్దు

కౌన్సెలింగ్ కార్యక్రమంలో అత్తాపూర్ ఇన్‌స్పెక్టర్ ఎ. సీతయ్య మాట్లాడుతూ… రౌడీ షీటర్లు గత నేరచరిత్రను పక్కనపెట్టి సన్మార్గంలో జీవించాలని సూచించారు. చట్టబద్ధమైన ఉపాధి మార్గాలను ఎంచుకుని కుటుంబాలతో ప్రశాంత జీవనం సాగించాలని సమాజంలో మంచి పౌరులుగా గుర్తింపు పొందేలా వ్యవహరించాలని హితవు పలికారు. రాత్రి వేళల్లో అనవసరంగా సంచరించడం గుంపులుగా తిరగడం గొడవలకు దిగడం, ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం వంటి చర్యలు సహించబోమని స్పష్టం చేశారు. పండుగల సందర్భంగా పోలీసులు ముమ్మర నిఘా కొనసాగిస్తారని తనిఖీల సమయంలో ప్రతి రౌడీ షీటర్ అందుబాటులో ఉండాల్సిందేనని తెలిపారు. ఇతర ప్రాంతాలకు చెందిన రౌడీ షీటర్లు ఆశ్రయం పొందినా, అనుమానాస్పద వ్యక్తుల సంచారం కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

బైండ్‌ ఓవర్‌ నిబంధనలు

అదేవిధంగా బైండ్ ఓవర్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, ప్రతి శనివారం పోలీస్ స్టేషన్‌లో నిర్వహించే హాజరుకు తప్పనిసరిగా హాజరు కావాలని ఇన్‌స్పెక్టర్‌ సీతయ్య ఆదేశించారు. మార్పు చూపించి సన్మార్గంలో నడిచే వారికి పోలీసు శాఖ సహకారం అందిస్తుందని, అయితే మళ్లీ నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్‌తో పాటు ఇతర కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌స్పెక్టర్ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News