శేరిలింగంపల్లి (తెలుగుప్రభ): శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ ప్రేమ్ నగర్ నాలాలో పడి గల్లంతైన బాలయ్య కుటుంబానికి బీఆర్‌ఎస్ ఆర్థిక భరోసా అందించింది. ఆయన కుటుంబానికి తాత్కాలిక ఉపశమనం కోసం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ తరపున స్థానిక నాయకులు రూ. 50 వేల ఆర్థిక సహాయం అందజేశారు.
నాలాలో గల్లంతైన బాలయ్య జాడ 5 రోజులైనా తెలియలేదని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపించారు. హైడ్రా, సీఎంసీ, జలమండలి అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కారణంగానే బాలయ్య మృతి చెందాడని మండిపడ్డారు. అధికారులు వెంటనే చొరవ తీసుకొని బాలయ్య ఆచూకీని గుర్తించాలని.. వారి కుటుంబానికి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ మాజీ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, మహిళా నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

