Homeతెలంగాణరంగారెడ్డిGHMC: సెల్లార్ తవ్వకాలతో కూలిన ప్రహరీ గోడ.. జోనల్ కమిషనర్ జోక్యంతో రంగంలోకి అధికారులు

GHMC: సెల్లార్ తవ్వకాలతో కూలిన ప్రహరీ గోడ.. జోనల్ కమిషనర్ జోక్యంతో రంగంలోకి అధికారులు

ఎల్​బీనగర్ (తెలుగుప్రభ): గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని కృష్ణవేణినగర్‌లో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం సెల్లార్ తవ్వకాల సమయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో పక్కనే ఉన్న శ్రీ అంబికా రెసిడెన్సీ అపార్ట్‌మెంట్ ప్రహరీ కూలిపోయింది. దీంతో అపార్ట్‌మెంట్ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘మహాలక్ష్మి డెవలపర్స్’ చేపడుతున్న నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న మాజీ కార్పొరేటర్​ బద్దం ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి బాధితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కూలిపోయిన ప్రహరీగోడను వెంటనే పునర్నిర్మించాలని, నిర్మాణ పనుల్లో భద్రతా ప్రమాణాలను తప్పనిసరిగా అమలు చేయాలని డెవలపర్ ప్రతినిధులను ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -

అపార్ట్‌మెంట్ నివాసితులతో కలిసి ఎల్‌బీనగర్ జోన్ జోనల్ కమిషనర్ వికాస్ మహతోను కలిసి సమస్యను వివరించారు. ఘటన తీవ్రతను గుర్తించిన కమిషనర్ వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జోనల్ కమిషనర్ ఆదేశాలతో టౌన్‌ప్లానింగ్ సెక్షన్ అధికారి అర్చన ఘటనాస్థలాన్ని పరిశీలించారు. నిర్మాణ పనుల్లో భద్రతా నిబంధనల ఉల్లంఘనపై నివేదిక రూపొందించి నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్మాణ సంస్థలు తప్పనిసరిగా సేఫ్టీ ప్రమాణాలు పాటించాలని అధికారులు సూచించారు.

wall collapse

ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రతను ప్రమాదంలోకి నెట్టేలా వ్యవహరించే నిర్మాణ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని బద్దం ప్రేమ్ మహేశ్వర్‌రెడ్డి అధికారులను కోరారు. అలాగే అపార్ట్‌మెంట్ వాసుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కూలిన ప్రహరీగోని ఆలస్యం చేయకుండా పునర్నిర్మించాలని డెవలపర్‌ను డిమాండ్ చేశారు. తమ సమస్యపై వెంటనే స్పందించి అధికారులతో సమన్వయం చేసి చర్యలు చేపట్టేలా కృషి చేసినందుకు అపార్ట్‌మెంట్ నివాసితులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News