Homeతెలంగాణరంగారెడ్డిConstruction of sheds: 111 జీవోలో షెడ్ల నిర్మాణం.. కళ్లు మూసుకున్న అధికారులు?

Construction of sheds: 111 జీవోలో షెడ్ల నిర్మాణం.. కళ్లు మూసుకున్న అధికారులు?

  • అధికార ప్రజాప్రతినిధికి చెందిన నిర్మాణమని స్థానికుల ఆరోపణ
  • ఫిర్యాదులు చేసినా కదలని యంత్రాంగమని స్థానికుల విమర్శలు
  • అనుమతులుంటే బహిర్గతం చేయండి… లేకుంటే పనులు నిలిపివేయాలని స్థానికుల డిమాండ్

గండిపేట్ (తెలుగు ప్రభ): నార్సింగి సర్కిల్ పరిధిలోని వట్టినాగులపల్లి ఔటర్ రింగ్ రోడ్ ప్రధాన రహదారి వెంబడి కొనసాగుతున్న భారీ ఇనుప షెడ్ల నిర్మాణాలు తీవ్ర చర్చకు దారితీశాయి. 111 జీవో నిబంధనలు వర్తించే ప్రాంతంలో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా, ఈ నిర్మాణం అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినదనే ప్రచారం జరుగుతోందని చెబుతున్నారు. అయితే ఈ విషయంపై స్వతంత్ర అధికారిక నిర్ధారణ వెలువడలేదు. నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టాన్ని అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం మౌనం పాటిస్తే నిబంధనల అమలు ఎలా జరుగుతుందని ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

కళ్లముందే పనులు… తనిఖీలు ఎక్కడ?

రోజు వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఓఆర్ఆర్ పక్కనే భారీ నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించారా లేదా అనే అంశంపై స్పష్టత లేదని స్థానికులు అంటున్నారు. బహిరంగంగా జరుగుతున్న నిర్మాణాలపై కూడా స్పందన లేకపోవడం ప్రజల్లో అనుమానాలకు తావిస్తోందని పేర్కొంటున్నారు.

111 జీవో అమలు కాగితాలకే పరిమితమైందా?

పర్యావరణ పరిరక్షణ, జలవనరుల సంరక్షణ కోసం అమలులోకి వచ్చిన 111 జీవో నిబంధనల పరిధిలో నిర్మాణాలకు ప్రత్యేక పరిమితులు ఉంటాయని స్థానికులు గుర్తుచేస్తున్నారు. అలాంటి ప్రాంతంలో జరుగుతున్న ఈ నిర్మాణాలకు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నారా లేదా అన్న విషయాన్ని అధికారులు బహిరంగంగా వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు.

అనుమతులు ఉంటే వెల్లడించండి…

ఈ నిర్మాణాలకు చట్టబద్ధమైన అనుమతులు మంజూరయ్యాయా? ఉంటే ఏ శాఖ నుంచి, ఎప్పుడు, ఏ నిబంధనల ప్రకారం అనుమతులు ఇచ్చారో ప్రజలకు తెలియజేయాలని స్థానికులు కోరుతున్నారు. ఒకవేళ నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నట్లు తేలితే వెంటనే నిర్మాణాలను నిలిపివేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఫిర్యాదులు చేసినా స్పందన కరువు..

ఈ నిర్మాణాలపై పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదులు అందించినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు కనిపించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థల పరిశీలన జరిగిందా? నోటీసులు జారీ చేశారా? అనుమతులను తనిఖీ చేశారా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావడం లేదని చెబుతున్నారు.

చిన్నవారికి నోటీసులు… పెద్ద నిర్మాణాలకు మినహాయింపు

సామాన్య ప్రజలు చిన్నపాటి నిర్మాణ నిబంధనలు ఉల్లంఘించినా వెంటనే చర్యలు తీసుకునే అధికారులు, భారీ స్థాయి నిర్మాణాల విషయంలో ఎందుకు మౌనం పాటిస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. చట్టం ముందు అందరూ సమానమే అయితే ఇక్కడ మాత్రం భిన్న పరిస్థితి ఎందుకు కనిపిస్తోందని నిలదీస్తున్నారు.

Also read: Sagar Ring Road: సాగర్ రింగ్‌ రోడ్డు–బీఎన్‌ రెడ్డి ఫ్లైఓవర్‌కు త్వరలో నిధులు

మౌనం వెనుక ఒత్తిళ్లు?

బహిరంగంగా నిర్మాణాలు కొనసాగుతున్నప్పటికీ అధికార యంత్రాంగం స్పందించకపోవడంతో రాజకీయ లేదా ఇతర ప్రభావాలు ఉన్నాయా అనే అనుమానాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై సంబంధిత అధికారులు తమ వైఖరిని స్పష్టం చేయాలని వారు కోరుతున్నారు.

ఉన్నతాధికారుల జోక్యం తప్పనిసరి..

జీహెచ్‌ఎంసీ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఉన్నతాధికారులు వెంటనే ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిర్మాణాలకు సంబంధించిన అనుమతులు, స్థల వివరాలు, వర్తించే నిబంధనలు, అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ప్రజలకు వెల్లడించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఆరోపణల్లో వాస్తవం ఉంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News