Serilingampally: సీపీఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనకు ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అయితే తమ్మినేనిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తమ్మినేనికి మెరుగైన వైద్య సేవలు అందించాలని జాన్‌వెస్లీ వైద్య బృందాన్ని కోరారు.
రాజకీయ వర్గాల్లో చర్చ: ఇటీవల తమ్మినేని వీరభద్రంపై సీపీఎం కేంద్ర కమిటీ అభిశంసన (Censure) వేటు వేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దశాబ్దాల కాలం పాటు కమ్యూనిస్టు సిద్ధాంతాల కోసం పని చేసిన కీలక నేతపై ఇటువంటి చర్య తీసుకోవడం చర్చనీయాంశమైంది. పార్టీ నిబంధనల ఉల్లంఘన లేదా ఇతర బలమైన కారణాల రీత్యానే కేంద్ర కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న నేతపై అభిశంసన జరగడం పార్టీ శ్రేణుల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు అనారోగ్యం, మరోవైపు పార్టీ పరమైన చర్యల నేపథ్యంలో తమ్మినేని వీరభద్రం వ్యవహారం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Also read-SSC Exams: పదో తరగతి పరీక్షల్లో ట్విస్ట్.. సొంత స్కూల్లోనే సెంటర్!
అభిశంసన వేటుకు కారణం!: సీపీఎం సీనియర్ నేత తమ్మినేని వీరభద్రాన్ని ఆ పార్టీ కేంద్ర కమిటీ అభిశంసించింది. ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్న సమయంలో తప్పుడు రాజకీయ దృక్పథాలను అనుసరించారని ఆరోపించింది. 2024లో జరిగిన రాష్ట్ర పార్టీ నూతన కార్యదర్శి ఎన్నిక సమయంలో లాబీయింగ్‌కు పాల్పడినట్లుగా విమర్శించింది. పార్టీ ప్రమాణాలను గాలికి వదిలేశారని పార్టీ కేంద్ర కమిటీ పేర్కొంది. తమ్మినేని తీరుతోనే పార్టీ రాష్ట్ర కమిటీ నిట్టనిలువునా చీలిందని పేర్కొంది. నూతన కార్యదర్శి ఎన్నిక సమయంలో తమ్మినేని వ్యవహరించిన తీరు పార్టీ సంప్రదాయాలకు, రాజకీయ సంస్కృతికి పూర్తి విరుద్ధమైనదమని కేంద్రకమిటీ స్పష్టం చేసింది.

