Homeతెలంగాణరంగారెడ్డిGO 111: అధికార పార్టీ నేతకు జీవో 111 వర్తించదా?.. అధికారుల తీరు వివాదాస్పదం

GO 111: అధికార పార్టీ నేతకు జీవో 111 వర్తించదా?.. అధికారుల తీరు వివాదాస్పదం

  •  జీవో111కు గండిపేట్‌లో గండి? అధికార పార్టీ నేత నిర్మాణంపై తీవ్ర ఆరోపణలు
  •  జీవో-111కు తూట్లు?.. గండిపేట్ చెంత భారీ అక్రమ షెడ్డు కలకలం
  • ఖానాపూర్‌లో అధికార పార్టీ నాయకురాలి నిర్మాణంపై ఆరోపణలు
  • అనుమతులు లేకుండానే పనులు కొనసాగుతున్నాయంటూ స్థానికుల ఆగ్రహం
  • చూసీ చూడనట్లు రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు?
  • విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్

గండిపేట్, జులై 15 (తెలుగు ప్రభ): గండిపేట్ జలాశయానికి అత్యంత సమీపంలోని ఖానాపూర్ గ్రామంలో జీవో-111 నిబంధనలకు విరుద్ధంగా భారీ షెడ్డు నిర్మాణం జరుగుతోందన్న ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అధికార పార్టీకి చెందిన ఓ మహిళా నాయకురాలు ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. జంట జలాశయాల పరిరక్షణకు అత్యంత కీలకమైన ప్రాంతంలో నిర్మాణ పనులు బహిరంగంగానే కొనసాగుతున్నప్పటికీ రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం ఆవుతున్నాయి. హైదరాబాద్ మహానగరానికి ప్రధాన తాగునీటి వనరులైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాలను పరిరక్షించేందుకు ప్రభుత్వం జీవో-111ను అమలు చేసింది. ఈ పరిధిలో భారీ నిర్మాణాలు, పరిశ్రమలు, కాలుష్యానికి దారితీసే కార్యకలాపాలపై కఠిన నియంత్రణలు అమలులో ఉన్నాయి. అలాంటి సున్నితమైన ప్రాంతంలో భారీ షెడ్డు నిర్మాణం జరుగుతుండటంతో జీవో నిబంధనలు అమలవుతున్నాయా? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొంతకాలంగా నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత శాఖల అధికారులు ఒక్కసారి కూడా తనిఖీలు నిర్వహించలేదని ఆరోపిస్తున్నారు. నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? లేదా? అనే విషయంపై కూడా అధికారులు స్పష్టత ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన నాయకురాలి నిర్మాణం కావడంతోనే అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జీవో-111 నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయంటూ పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. చట్టం అందరికీ సమానమైతే అధికార పార్టీ నాయకుల విషయంలో ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.

- Advertisement -

Also read: Ramanthapur: రామంతపూర్ ప్రభుత్వ హోమియో ఆసుపత్రిలో బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవేర్‌నెస్‌ ప్రోగ్రాం

వివరణ ఇవ్వని టౌన్ ప్లానింగ్ అధికారులు…

ఖానాపూర్‌లో నిర్మాణంలో ఉన్న ఈ షెడ్డు విషయంలో వివరణ కోసం నార్సింగి సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ ప్రసీద, టీపీఎస్ రమేష్‌ను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ వారు స్పందించలేదని సమాచారం. ఏసీపీ ప్రసీద ఫోన్‌ను కట్ చేసినట్లు తెలిసింది. అక్రమ నిర్మాణాలపై వివరణ కోరినా అధికారులు అందుబాటులోకి రాకపోవడం, స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని స్థానికులు పేర్కొంటున్నారు. కాగా, ఖానాపూర్‌లో కొనసాగుతున్న ఈ నిర్మాణంపై జిల్లా యంత్రాంగం తక్షణమే సమగ్ర విచారణ చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అనుమతులు లేకుండా లేదా జీవో-111 నిబంధనలను ఉల్లంఘిస్తూ నిర్మాణం చేపట్టినట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అక్రమ నిర్మాణాల విషయంలో అధికారులు ఇదే విధంగా నిర్లక్ష్యం కొనసాగిస్తే జంట జలాశయాల పరిరక్షణ లక్ష్యమే దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News