శేరిలింగంపల్లి (తెలుగుప్రభ): అర్ధరాత్రి చందానగర్‌లో భారీ చోరీ స్థానికంగా కలకలం రేపింది. జ్యువెలరీ షాపులోకి చొరబడిన గుర్తు తెలియని దుండగులు బంగారం, వెండిని సునాయాసంగా అపహరించారు. ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించి లోపలకి దూరిన దొంగలు అందినకాడికి దోచుకెళ్లారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నూకల శివశంకర్‌కు చెందిన బాలాజీ జ్యువెలరీ దుకాణంలో శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దుండగులు షాప్ వెనుక భాగంలో ఉన్న డోర్ ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించి రంధ్రం పెద్దగా చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం వెనుక గది నుంచి ముందు గదికి మధ్యనున్న డోర్‌కి రంధ్రం చేశారు. షాప్‌లోని బంగారు, వెండి ఆభరణాలను అపహరించారు.
రూ. లక్షల్లో చోరీ
చోరీ ఘటనలో సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి చోరీకి గురైనట్లు షాపు యాజమాన్యం ప్రాథమికంగా గుర్తించింది. సమాచారం అందుకున్న వెంటనే శేరిలింగంపల్లి డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ వై. శ్రీనివాస్ కుమార్, సీసీఎస్, ఎస్‌వోటీ, చందానగర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

దర్యాప్తు వేగవంతం
క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, ఇతర అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలు చర్యలు చేపట్టాయి. ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

