- ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ నిబంధనలపై నీళ్లు
- ఇరిగేషన్ శాఖ మౌనం.. అనుమతులపై అనుమానాలు
- మాజీ ప్రజాప్రతినిధి పాత్రపైనా చర్చ
గండిపేట్ (తెలుగు ప్రభ): రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని బండ్లగూడ జాగీర్ పరిధిలోని పీరం చెరువు చుట్టూ జరుగుతున్న నిర్మాణాల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చెరువు పరిరక్షణకు ఉద్దేశించిన ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ నిబంధనలు అమలవుతున్నాయా? లేదా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు, టౌన్ ప్లానింగ్ విభాగం జారీ చేసిన ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఇరిగేషన్ శాఖ వ్యవహార శైలిపై స్థానికులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఓసీల జారీపై అనుమానాలు..
చెరువు ప్రభావిత ప్రాంతాల్లో నిర్మాణాలకు నిబంధనల ప్రకారం కఠిన పరిశీలన అనంతరమే అనుమతులు ఇవ్వాల్సి ఉండగా, కొన్ని భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ఎలా జారీ అయ్యాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు భౌతిక పరిశీలన లేకుండానే ఓసీలు మంజూరు చేశారనే ఆరోపణలు స్థానికంగా చర్చకు దారితీశాయి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఇరిగేషన్ శాఖ ఎందుకు స్పందించడం లేదు?
చెరువు హద్దులు, ఎఫ్‌టీఎల్ రక్షణ బాధ్యతలు ఇరిగేషన్ శాఖ పరిధిలోకి వస్తాయి. అయినప్పటికీ, చెరువు పరిధిలో నిర్మాణాలు కొనసాగుతున్నా, ఆక్రమణలపై శాఖ నుంచి గట్టి చర్యలు కనిపించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పలుమార్లు ఫిర్యాదులు చేసినా పరిశీలనలకే పరిమితమవుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
మాజీ ప్రజాప్రతినిధి పాత్రపైనా చర్చ
ఈ వ్యవహారంలో ఓ మాజీ కార్పొరేటర్ కీలకంగా వ్యవహరించారనే ప్రచారం స్థానికంగా సాగుతోంది. నిర్మాణాలకు సంబంధించిన అనుమతుల ప్రక్రియలో మధ్యవర్తిత్వం చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నప్పటికీ, దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. ఈ కోణంలోనూ దర్యాప్తు జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
పీరంచెరువు భద్రతకే ముప్పు..
పీరం చెరువు క్రమంగా కుదించుకుపోతుండటంతో భవిష్యత్తులో భారీ వర్షాల సమయంలో వరద ముప్పు పెరిగే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సహజ నీటి ప్రవాహాలకు అడ్డంకులు ఏర్పడితే పరిసర కాలనీలు ముంపునకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
Also Read: Festival : వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం… ట్రాఫిక్ మళ్లింపులు ఇవే!
ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని డిమాండ్..
పీరం చెరువు పరిధిలో జరిగిన నిర్మాణాలు, జారీ చేసిన ఓసీలు, ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్ ఉల్లంఘనలపై ఉన్నతస్థాయి విచారణ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులు ఎవరైనా ఉంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువు ఆక్రమణలను తొలగించి ప్రభుత్వ భూమిని పరిరక్షించాలని కోరుతున్నారు.

