Homeతెలంగాణరంగారెడ్డిRobbery case: షూటర్ ఇర్ఫాన్‌కు సంకెళ్లు.. దోపిడీ కేసు దర్యాప్తులో అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్టు

Robbery case: షూటర్ ఇర్ఫాన్‌కు సంకెళ్లు.. దోపిడీ కేసు దర్యాప్తులో అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్టు

  • 41 కేసులు.. 13 నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఉన్నట్లు పోలీసుల వెల్లడి
  • రాత్రి వేళ దోపిడీ ఘటనను ఛేదించిన నార్సింగి పోలీసుల ప్రత్యేక బృందం

గండిపేట్ (తెలుగు ప్రభ): నగర శివార్లలో ఇటీవల చోటుచేసుకున్న దోపిడీ ఘటనను ఛేదించిన నార్సింగి పోలీసులు పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు షేక్ ఇర్ఫాన్ అహ్మద్ అలియాస్ షూటర్ ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్‌కు ఆదేశించినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల కథనం ప్రకారం, ఈ నెల 6న అర్ధరాత్రి సమయంలో హిమాయత్‌సాగర్ రోడ్డులోని టీజీపీఏ రోటరీ సమీపంలో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులను నిందితుడు తన అనుచరులతో కలిసి వారి వాహనానికి అడ్డుతగిలినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం వారిని బలవంతంగా ద్విచక్ర వాహనాలపై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి కత్తులతో బెదిరించి నగదు, పవర్‌ బ్యాంకులను లాక్కొన్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, బాధితుల బ్యాంకు ఖాతా నుంచి ఆన్‌లైన్ ద్వారా నగదు బదిలీ చేయించినట్లు కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు తెలిపారు. ఘటన అనంతరం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు, ఇతర సమాచారాన్ని విశ్లేషించి ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. విచారణలో అతడిపై తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో దోపిడీలు, డకాయితీలు, హత్యాయత్నాలు, ఇంటి చోరీలు, బలవంతపు వసూళ్లు, బెదిరింపులు తదితర కేసులతో కలిపి మొత్తం 41 క్రిమినల్ కేసులు నమోదైనట్లు గుర్తించినట్లు తెలిపారు. అలాగే వివిధ కోర్టుల్లో అతడిపై 13 నాన్‌ బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయని, నేరాలకు పునరావృతంగా పాల్పడుతున్నాడనే ఆరోపణల నేపథ్యంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్)లోని సంబంధిత నిబంధనల ప్రకారం అదనపు చర్యలు కూడా చేపట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసు దర్యాప్తును సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు శేరిలింగంపల్లి జోన్ అధికారుల పర్యవేక్షణలో నార్సింగి పోలీస్ బృందం నిర్వహించినట్లు వెల్లడించారు. రాత్రి వేళల్లో ప్రయాణించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా నేర కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Also Read: Construction of sheds: 111 జీవోలో షెడ్ల నిర్మాణం.. కళ్లు మూసుకున్న అధికారులు?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News