RTC Bus Hits Car: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామ సమీపంలో ఆర్టీసీ బస్సు, కారు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. హైవేపై ఉన్న యూటర్న్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అయితే బస్సు డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. అంతేకాకుండా కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు సకాలంలో తెరుచుకోవడంతో పాటు అందులోని ఇద్దరు ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు.
యూటర్న్ వద్ద ప్రమాదం: హైదరాబాద్ నుండి చేవెళ్ల వైపు వస్తున్న మెహదీపట్నం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు.. మల్కాపూర్ వద్ద యూటర్న్ తీసుకుంటున్న బ్రెజ్జా కారును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఎదురుగా వస్తున్న కారును గమనించిన బస్సు డ్రైవర్ తక్షణమే అప్రమత్తమై బస్సును నియంత్రించడంతో లోపల ఉన్న ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు. అనంతరం ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను ఇతర బస్సుల్లో వారి గమ్యస్థానాలకు చేర్చారు.
సకాలంలో తెరుచుకున్న ఎయిర్‌బ్యాగ్‌లు: ప్రాణాలు నిలిపిన ఎయిర్‌బ్యాగ్‌లు ఢీకొన్న వేగానికి కారు ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ.. అదృష్టవశాత్తూ కారులోని ఎయిర్‌బ్యాగ్‌లు సకాలంలో ఓపెన్ అయ్యాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకున్నారు. అయినప్పటికీ వారికి స్వల్ప గాయాలయ్యాయి.
Also read-POCSO Case: ఏపీలో దారుణం.. కూతురు వరుస బాలికపై లైంగిక దాడి!
పోలీసుల తక్షణ స్పందన: ప్రమాదంపై సమాచారం అందుకున్న చేవెళ్ల పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరు కారు ప్రయాణికులను స్థానిక 108 అంబులెన్స్ ద్వారా చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. రహదారిపై నిలిచిపోయిన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

