Homeతెలంగాణరంగారెడ్డిService roads: సర్వీసు రోడ్లు మాయం.. నరకప్రాయంగా నగర ప్రయాణం!

Service roads: సర్వీసు రోడ్లు మాయం.. నరకప్రాయంగా నగర ప్రయాణం!

Serilingampally: భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలు నిత్యకృత్యంగా మారాయి. ముఖ్యంగా శేరిలింగంపల్లి నుంచి కూకట్‌పల్లి వరకు ప్రధాన రహదారి వెంట ఉన్న సర్వీసు రోడ్లు అక్రమార్కుల చేతుల్లో బందీ అవుతున్నాయి. పాదచారులు నడవడానికి, వాహనాలు వెళ్లడానికి వీలులేకుండా వెలుస్తున్న దుకాణాలు, అడ్డదిడ్డంగా నిలుపుతున్న వాహనాలతో సామాన్య జనం అష్టకష్టాలు పడుతున్నారు.

- Advertisement -

యధేచ్ఛగా మామూళ్ల పర్వం: శేరిలింగంపల్లి జోనల్ పరిధిలోని చందానగర్, మదీనాగూడ, మియాపూర్, హైదర్ నగర్ ప్రాంతాల్లో సర్వీసు రోడ్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. ప్రముఖ షాపింగ్ మాల్స్, వస్త్ర దుకాణాలు, షోరూమ్‌లు తమకు కేటాయించిన పార్కింగ్ స్థలాలను వదిలేసి.. రోడ్లనే పార్కింగ్ జోన్లుగా మార్చేశాయి. సర్వీసు రోడ్లను ఆనుకుని వెలుస్తున్న ఛాయ్ బండ్లు, టిఫిన్ సెంటర్లు, తోపుడు బండ్లతో రోడ్లు కుంచించుకుపోతున్నాయి. వీరికి కొందరు స్థానిక నాయకుల మద్దతు ఉండటంతో మామూళ్ల పర్వం యధేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అనేక విద్యాసంస్థల బస్సులు సైతం సర్వీసు రోడ్లనే తమ శాశ్వత పార్కింగ్ కేంద్రాలుగా వాడుకుంటున్నాయి.

అంబులెన్స్‌లకు దారి దొరకని పరిస్థితి!: గంగారం నుంచి బీహెచ్‌ఈఎల్ వరకు పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అను ఫర్నీచర్ నుంచి రాయల్ కేఫ్ వరకు ఉన్న రోడ్డులో వీధి వ్యాపారులు, వినియోగదారుల వాహనాలతో అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి నెలకొంది. గతంలో చందానగర్ రైల్వే స్టేషన్ వద్ద వీధి వ్యాపారుల కోసం ప్రత్యేక సముదాయం ఏర్పాటు చేసినా.. అధికారులు వెనక్కి తిరగగానే మళ్లీ మెయిన్ రోడ్డుకే మకాం మారుస్తున్నారు. చెన్నారెడ్డి హాస్పిటల్ సమీపంలో అడ్డదిడ్డంగా వెలిసిన టిఫిన్ సెంటర్ల వల్ల రోగులను తీసుకెళ్లే అంబులెన్స్‌లకు కూడా దారి దొరకని పరిస్థితి ఏర్పడింది.

అధికారుల హడావుడి మూడు నాళ్ల ముచ్చటే: సర్వీసు రోడ్ల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుండడంతో జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల తీరుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. “నెలకోసారి వచ్చి రోడ్ల మీద సామాన్లు తీయించి హడావుడి చేస్తారు. మరుసటి రోజు నుంచి మళ్లీ షరామామూలే. రోడ్డు మీద బండి ఆపితే సామాన్యుడికి భారీగా చలాన్లు బాదుతున్న పోలీసులు.. రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న బడా మాల్స్ యాజమాన్యాలపై మాత్రం కన్నెత్తి చూడటం లేదు” అని వాహనదారులు మండిపడుతున్నారు.

పేదలపైనే వారి ప్రతాపం: జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల ప్రతాపం కేవలం పేదలపైనేనని సీపీఎం నాయకులు కొంగరి కృష్ణ ఆరోపించారు. బడా వ్యాపార సముదాయాలు రోడ్లను ఆక్రమించి పార్కింగ్ చేసుకుంటుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఆటో డ్రైవర్లను, చిరు వ్యాపారులను ఇబ్బంది పెట్టడం మానేసి.. ప్రధాన ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కొంగరి కృష్ణ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతున్నామని చెప్తున్న పాలకులు.. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో ఉన్న ట్రాఫిక్ నుంచి ప్రజలను గట్టెక్కించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News