Homeతెలంగాణరంగారెడ్డిMusi River: మూసీ నదిలో గుర్రపు డెక్క.. దోమలపై డ్రోన్ అస్త్రం.. జోనల్ కమిషనర్ సోలిపేట...

Musi River: మూసీ నదిలో గుర్రపు డెక్క.. దోమలపై డ్రోన్ అస్త్రం.. జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి

  •  క్యూలెక్స్ దోమల నివారణకు డ్రోన్‌తో లార్విసైడ్ స్ప్రేయింగ్
  • గుర్రపు డెక్క నిర్మూలనకు ఆధునిక యంత్రాల కొనుగోలుకు టెండర్లు
  • ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోన్ చర్యలు

రాజేంద్రనగర్ (తెలుగు ప్రభ): మూసీ నదిలో విస్తరిస్తున్న గుర్రపు డెక్కతో పెరుగుతున్న క్యూలెక్స్ న్యూసెన్స్ దోమలకు చెక్ పెట్టేందుకు జీహెచ్‌ఎంసీ రాజేంద్రనగర్ జోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రంగంలోకి దింపింది. జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి ఆదేశాల మేరకు డ్రోన్‌లతో లార్వా నిర్మూలన చేపట్టడంతో పాటు గుర్రపు డెక్కను శాశ్వతంగా తొలగించే దిశగా సమగ్ర కార్యాచరణ ప్రారంభించింది. బుధవారం అత్తాపూర్ నుంచి బాపూఘాట్ వరకు మూసీ నది పరివాహక ప్రాంతంలో సీనియర్ ఎంటమాలజిస్ట్ గంగప్ప పర్యవేక్షణలో డ్రోన్ ద్వారా మస్కిటో లార్విసైడ్ ఆయిల్‌ను స్ప్రే చేశారు. గుర్రపు డెక్క అధికంగా పేరుకుపోయిన ప్రాంతాలను గుర్తించి లక్ష్యితంగా స్ప్రేయింగ్ నిర్వహించారు. దీంతో, దోమల లార్వా నిర్మూలనతో పాటు వాటి వ్యాప్తిని నియంత్రించే చర్యలకు మరింత వేగం లభించింది. మూసీ నదిలో గుర్రపు డెక్క సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న లక్ష్యంతో జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి ఆధునిక యంత్రాల సమీకరణకు చర్యలు చేపట్టారు. ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్, హిటాచి యంత్రాల కొనుగోలుకు త్వరలో టెండర్లు ఆహ్వానించనున్నట్లు అధికారులు తెలిపారు. యంత్రాలు అందుబాటులోకి వచ్చిన వెంటనే గుర్రపు డెక్క తొలగింపు పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టనున్నట్లు వెల్లడించారు. సీనియర్ ఎంటమాలజిస్ట్ గంగప్ప మాట్లాడుతూ.. గుర్రపు డెక్కలో పెరిగే క్యూలెక్స్ దోమలు ప్రధానంగా న్యూసెన్స్ దోమలని, ప్రజలను కుట్టి తీవ్ర అసౌకర్యానికి గురిచేస్తాయని తెలిపారు. ఇవి సాధారణంగా వ్యాధుల వ్యాప్తికి కారణం కాకపోయినా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా డ్రోన్ స్ప్రేయింగ్, గుర్రపు డెక్క నిర్మూలన కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నట్లు వివరించారు. ప్రజారోగ్య పరిరక్షణకు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తూ మూసీ పరివాహక ప్రాంతంలో దోమల నియంత్రణ, గుర్రపు డెక్క నిర్మూలనకు సమగ్ర కార్యాచరణ అమలు చేస్తున్న జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్‌రెడ్డి చర్యలు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి.

- Advertisement -

Also read: Journalists: జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి.. సమాచార్ భవన్ ఎదుట టీడబ్ల్యూజేఎఫ్ ధర్నా

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News