Summer Effect Highest Temperatures: తెలంగాణలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ సీజన్‌లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు చేరుకుంటున్నాయి. వేసవి తాపంతో ప్రజలు తీవ్ర ఉక్కపోతకు గురై సతమతమవుతున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-clarified-four-issues-to-the-employee-unions/
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇవాళ ఒక్కరోజే గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సీజన్‌లోనే ఈరోజు రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలుగా పేర్కొంది. నిజామాబాద్ జిల్లాలో గరిష్ఠంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. నల్గొండ, నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో 45.9 డిగ్రీలు, ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో 45.8 డిగ్రీలు నమోదయ్యాయని వివరించింది.
ఎండలు రోజురోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని.. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ బయటకు వెళ్లడం, ప్రయాణాలు లాంటివి చేయవద్దని సూచిస్తున్నారు. చిన్నారులు, గర్భిణీలు, వృద్ధులు తరచుగా నీళ్లు, కొబ్బరి నీరు, మజ్జిగ, జ్యూస్ లాంటివి తాగుతూ డీహైడ్రేషన్ గురవకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెబుతున్నారు.

