Revanth government keeps its promise to employees: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిల చెల్లింపునకు రూ.2 వేల కోట్లు విడుదల చేసింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బకాయిలను కేవలం 100 రోజుల్లో చెల్లిస్తామని, రూ.6 వేల కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉద్యోగ జేఏసీ నాయకులకు ఇటీవల స్పష్టమైన హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ హామీని నెరవేర్చే దిశగా కీలక అడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఈరోజు తొలి విడతగా రూ. 2 వేల కోట్ల నిధులను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also read: TTD News: టీటీడీ గుడ్‌న్యూస్.. వారికి ప్రతిరోజూ 300 దర్శన టికెట్లు.. కండీషన్స్ అప్లై..!
రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ బకాయిలన్నీ క్లియర్..
ఈరోజు విడుదల చేసిన నిధులతో రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన బకాయిలను ప్రభుత్వం పూర్తిగా చెల్లించింది. రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) బకాయిల మొత్తాన్ని వంద శాతం క్లియర్ చేశారు. అలాగే రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి మే 2025 వరకు పెండింగ్‌లో ఉన్న కమ్యూటేషన్ బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించారు. ముందస్తు ప్రణాళికలు, పక్కా కార్యాచరణతోనే ఇది సాధ్యమైందని ప్రభుత్వం ప్రకటించింది. ఇచ్చిన మాట ప్రకారం మిగిలిన రూ. 4 వేల కోట్ల బకాయిలను కూడా నిర్ణీత గడువులోగా ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయడానికి ప్రభుత్వం శరవేగంగా కసరత్తు చేస్తున్నట్లు తెలిపింది. ఉద్యోగుల సంక్షేమం పట్ల ప్రభుత్వం చూపుతున్న ప్రత్యేక శ్రద్ధపై ఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్కకు కృతజ్ఙతలు తెలియజేశారు.

