Revanth Reddy Osmania University Speech Students: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ (బుధవారం) ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించిన గడ్డ ఓయూ అని పేర్కొన్నారు. ఓయూకు వెళ్తున్నానని అంటే కొంతమంది ఎందుకంత ధైర్యం చేస్తున్నావని అడిగారని, కానీ ఓయూకు రావాలంటే ధైర్యం కాదు, అభిమానం కావాలని చెప్పారు. గుండెల నిండా అభిమానాన్ని నింపుకుని యూనివర్సిటీ అభివృద్ధికి బాటలు వేసేందుకు ఇక్కడికి వచ్చానని, ఓయూను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఉన్నానని తెలిపారు. తెలంగాణ గడ్డకు ఒక చైతన్యం, పౌరుషం ఉంది. ఆ చైతన్యం, పౌరుషానికి చదువుతో పనిలేదన్నారు. ఆధిపత్యం చెలాయించాలని చూసిన ప్రతీసారి తెలంగాణలో తిరుగుబాటు మొదలైందని, సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యంపై పోరాటం కొనసాగిందని వివరించారు. మన సమస్యలకు శాశ్వత పరిష్కారం తెలంగాణ సాధనతోనే జరుగుతుందని ఓయూ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నడుం బిగించారని తెలిపారు. పీవీ నర్సింహా రావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ లాంటి గొప్ప వ్యక్తులను అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదని ప్రశంసించారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో ఓయూ ముందు భాగాన నిలిచిందని గుర్తు చేశారు.
విద్య, సామాజిక న్యాయం అందించడమే లక్ష్యం..
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “తెలంగాణ వస్తే మా తమ్ముల్లు ఎవరి ఆస్తులు, ఫామ్ హౌస్ అడగలేదు. మా తమ్ముల్లు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు మాత్రమే అడిగారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందిస్తున్నామని సీఎం హామీ ఇచ్చారు. పదేళ్లు తెలంగాణ తల్లి ఎట్లుంటదో అధికారికంగా గుర్తించలేదు. బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేసుకున్నాం. ఎస్సీ వర్గీకరణ చేసి అమలు చేసి సామాజిక న్యాయం చేశాం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేశాం, కేంద్ర ప్రభుత్వం జనగణనతో కులగణన చేపట్టే పరిస్థితులు కల్పించాం. ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవని, ఉన్నది ఉన్నట్టు చెబితే మమ్మల్ని విమర్శిస్తున్నారని అన్నారు. వందల ఎకరాల్లో ఫామ్ హౌసులు కట్టుకున్నోళ్లు పదేళ్లలో దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదని ప్రశ్నించారు. విద్య ఒక్కటే వెనకబాటుతనం లేకుండా చేయగలుగుతుంది.” అని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు.
నాణ్యమైన విద్య కోసమే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్..
“విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుంది, జీవితాల్లో వెలుగులు నింపుతుంది. కులం అడ్డుగోడలను తొలగించేందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. యువత నైపుణ్యాన్ని పెంపొందించేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేశామన్నారు. ఆనంద్ మహీంద్రా లాంటి గొప్ప వ్యక్తులను డైరెక్టర్లుగా నియమించి మీకు స్ఫూర్తిని కలిగించే ప్రయత్నం చేశాం. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నాం. మట్టిలో మాణిక్యాలను వెలికితీసేందుకు ప్రణాళికలు రచిస్తున్నాం. పేదలకు ఏదైనా చేయాలనేదే తపనతో రూ. 1000 కోట్లతో ఉస్మానియాను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని సంకల్పించాం. యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ భర్తీకి కమిటీ వేశాం. మీరంతా డాక్టర్లు, లాయర్లు, ఉన్నతాధికారులు కావాలి. యూనివర్సిటీ నుంచి నాయకులై రాష్టాన్ని పరిపాలించాలని కోరుకుంటున్నాను.” అని సీఎం రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని ముగించారు.

