Professor Jayashankar Birth Anniversary Celebrations : తెలంగాణ అనే మూడక్షరాల మంత్రాన్ని దశాబ్దాల పాటు తన ఆత్మఘోషగా మార్చుకుని, ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసలుగా జీవించిన వైతాళికుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్. ఆయన జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఆరు దశాబ్దాల అకుంటిత పోరాటం.. అనన్య సామాన్యం : హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసిన నాటి నుంచే అన్యాయాన్ని నిలదీస్తూ వొంటిచేత్తో వైజ్ఞానిక సమరాన్ని నడిపిన మహోన్నత మూర్తి ప్రొఫెసర్ జయశంకర్. తెలంగాణ ఉద్యమానికి ఒక స్పష్టమైన సిద్ధాంత ఆధారాన్ని నిర్మించి, ఊరూరా ప్రజల్లో ఆత్మగౌరవ జ్వాలలను రగిలించిన ‘ఉద్యమ పితామహుడు’గా ఆయన చరిత్ర పుటల్లో నిలిచిపోయారు.
జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనను స్మరించుకుంటూ.. “తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ పాత్ర అత్యంత కీలకమైంది, చారిత్రాత్మకమైనది. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఆజన్మాంతం అహర్నిశలు శ్రమించిన మహనీయుడు ఆయన” అని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

