Revised market values of lands in Telangana: తెలంగాణలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. భూముల విలువల సవరణ శాస్త్రీయంగా, హేతుబద్ధంగా చేపట్టి పూర్తి చేశామన్నారు. క్షేత్రస్థాయి అధ్యయనం, మార్కెట్ పరిస్థితుల మేరకు కొత్త రేట్లు ఉంటాయన్నారు. నిపుణుల సూచనలు, అధికారుల సలహాలతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రాంతాల వారీగా మార్కెట్ ధరలు, రిజిస్ట్రేషన్లు పరిశీలించాకే భూముల ధరలను హేతుబద్ధంగా పెంచాలని నిర్ణయించామన్నారు.
హేతుబద్ధంగానే మార్కెట్ విలువల పెంపు..
‘‘రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో మార్కెట్ విలువలపై ఇప్పటికే సమీక్షలు జరిపాం. గ్రామీణ, పట్టణ మార్కెట్ విలువల సవరణ కమిటీలు అధ్యయనం చేశాయి. అభివృద్ధి, భూముల డిమాండ్, మార్కెట్ పరిస్థితులు, ఓఆర్‌ఆర్, ఆర్‌ఆర్‌ఆర్, కొత్త రోడ్లు, పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణను ప్రమాణాలుగా తీసుకున్నాం. ఫ్లాట్ల విషయంలో అసమానతలు తొలగిస్తూ కొన్ని చోట్ల అన్ని అంతస్తులకు ఒకే ధర ఉంటుంది. ఇప్పటికే అధిక ధర ఉన్నచోట ఎలాంటి పెంపు ఉండదు. హెచ్‌ఎండీఏ, క్యూర్, ఇతర ప్రాంతాలకు ప్రాథమిక మార్కెట్ రేట్లు నిర్ణయించాం. వ్యవసాయ భూములు, ప్లాట్లు, ఫ్లాట్లకు కొత్త కనీస రేట్లు ఖరారు చేశాం. 2021 తర్వాత నిర్మాణ వ్యయాలు సవరించడంతో కొత్త ధరల అవసరం ఏర్పడింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకతతో సవరణలు చేపట్టాం. ప్రజలు సహకరించాలని కోరుతున్నాం.’’ అని మంత్రి తెలిపారు.

