HomeతెలంగాణRobotic Surgeries: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీలు..మంత్రి దామోదర్ రాజనర్సింహ

Robotic Surgeries: ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ సర్జరీలు..మంత్రి దామోదర్ రాజనర్సింహ

హైదరాబాద్, సెప్టెంబర్ 13 (తెలుగుప్రభ): ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక వైద్య సేవలను సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకువచ్చే దిశగా చర్యలు చేపడుతున్నామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఇందులో భాగంగా వచ్చే ఆరు నెలల్లో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రుల్లో (జీజీహెచ్) అధునాతన రోబోటిక్ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 90 శాతం శస్త్రచికిత్సలను ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. ఆదివారం సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి టిమ్స్ ఆసుపత్రిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మల్టీ స్పెషాలిటీ రోబోటిక్ సర్జరీ వర్క్‌షాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యాధునిక రోబోటిక్ వైద్య పరికరాలు, మౌలిక వసతులను పరిశీలించి, వాటి వినియోగంపై నిపుణులతో చర్చించారు. రోబోటిక్ సర్జరీలో వస్తున్న ఆధునిక సాంకేతికత, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వాటి విస్తరణపై నిపుణులతో చర్చించారు.

- Advertisement -

ఆరు నెలల్లో విస్తృత సేవలు
రాష్ట్రంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు. వైద్య రంగంలో ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు మెడికల్ కాలేజీలను బలోపేతం చేస్తున్నామన్నారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, ఇతర నిపుణులకు ఆధునిక నైపుణ్యాలతో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. రోబోటిక్ సర్జరీ రంగంలో దేశంలో ప్రముఖ నిపుణుడైన డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ సేవలను తెలంగాణలో వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికే నిమ్స్‌లో తక్కువ వ్యవధిలోనే 1,000 రోబోటిక్ శస్త్రచికిత్సలు నిర్వహించడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రి, టిమ్స్, నూతనంగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, నీలోఫర్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జీజీహెచ్‌లకు రోబోటిక్ సర్జరీ సేవలను విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.

మరో 79 డయాలసిస్ కేంద్రాలు
నూతనంగా నిర్మిస్తున్న టిమ్స్, ఉస్మానియా ఆసుపత్రుల నిర్మాణం పూర్తయితే రాష్ట్రంలో 40 వేలకుపైగా అదనపు పడకలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. తెలంగాణను వైద్య రంగంలో అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మెడికల్ టూరిజం పాలసీలో భాగంగా టిమ్స్‌లో అంతర్జాతీయ రోగుల కోసం 100 పడకలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. క్యాన్సర్ కేర్, ట్రామా కేర్ పాలసీలను అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటికే 102 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, మరో 79 కేంద్రాలను కొత్తగా ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. అత్యాధునిక రోబోటిక్ సర్జరీ సేవలకు తెలంగాణను ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. కార్యక్రమంలో డీఎంఈ డాక్టర్ వాణి, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నరేంద్ర కుమార్, డాక్టర్ బీరప్ప, డాక్టర్ విమల థామస్, డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ, డాక్టర్ రాజ్ గజ్భియే తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News