Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు సాకుతో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులను రాజకీయంగా ఇరికించేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మండిపడ్డారు.
ఛార్జ్‌షీట్‌లో జాప్యం: మార్చి 2024లో ఒక పోలీస్ అధికారి ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు.. ఏడు నెలలు గడిచినా కొలిక్కి రాకుండా ధారావాహికలా కొనసాగుతోందని ప్రవీణ్ కుమార్ విమర్శించారు.ఇప్పటివరకు దాదాపు 350 మంది సాక్షులను విచారించారని అన్నారు. అయినా ఇంతవరకు ఛార్జ్‌షీట్ ఎందుకు ఫైల్ చేయలేదని ఆయన ప్రశ్నించారు.దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకే కేసులో రెండుసార్లు సిట్(SIT) ఏర్పాటు చేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపునకేనని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా పేర్కొన్న మాజీ అధికారి ప్రభాకర్ రావును విచారణ పేరుతో ప్రభుత్వం మానసికంగా వేధించిందని ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం వ్యాఖ్యలను గుర్తు చేస్తూ: గతంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దిల్లీలో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సాధారణ ప్రక్రియ అన్న విషయాన్ని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఏ ప్రభుత్వమైనా చేస్తుందని తెలిపారు. “ఒకవేళ అధికారులు ఎవరైనా తప్పు చేసి ఉంటే చట్టబద్ధంగా విచారణ జరపాలి. కానీ.. లేని ఆధారాలను ఫ్యాబ్రికేట్ చేసి రాజకీయ నాయకులను బలిపశువులను చేయాలని చూడటం దారుణం” అని పేర్కొన్నారు.

