Uday Krishna Reddy: వివాదాస్పద రీతిలో వార్తల్లో నిలిచిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించిన పోలీస్ విచారణలో పలు విస్మయపరిచే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన ప్రవర్తన, వ్యక్తిగత వ్యవహారాలపై పోలీసులు జరిపిన లోతైన పరిశోధనలో కీలక ఆధారాలు లభ్యమైనట్లు తెలుస్తుంది.
మరో వివాహితతో లివ్-ఇన్ రిలేషన్ కోసం ఒత్తిడి: పోలీసుల కథనం ప్రకారం 2014లో వివాహమై.. కుటుంబ కలహాల కారణంగా 2023 నుండి భర్తకు దూరంగా కుమారుడితో నివాసముంటున్న ఒక మహిళతో ఉదయ్ కృష్ణారెడ్డికి పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమె హైదరాబాద్ వచ్చి కొంతకాలం ప్రైవేట్ ఉద్యోగం చేశారు. అయితే ఉదయ్ సూచన మేరకు ఆ ఉద్యోగాన్ని వదిలేసి అశోక్‌నగర్‌లోని ఒక ప్రముఖ ఐఏఎస్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. ఈ క్రమంలో తనతో ‘లివ్-ఇన్ రిలేషన్’లో ఉండాలని ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. కానీ తనకు ఇంకా భర్తతో విడాకులు రాలేదనే కారణంతో సదరు మహిళ ఆయన ప్రతిపాదనను నిరాకరించారు.
మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను కలిసిన సదరు బాధితురు: ఈ ఏడాది ఫిబ్రవరిలో సదరు మహిళను కలిసిన ఉదయ్ కృష్ణారెడ్డి.. లివ్-ఇన్ రిలేషన్ కోసం తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఆమె నిరాకరించడంతో తీవ్రస్థాయిలో భౌతిక దాడి చేసి విపరీతంగా కొట్టినట్లు విచారణలో తేలింది. ఈ విషయాన్ని బాధిత మహిళ ఒక మహిళా ట్రైనీ ఐపీఎస్‌కు తెలిపారు. అనంతరం ఉదయ్ కృష్ణారెడ్డిని పూర్తిగా దూరం పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.
Also Read-Harish Rao: క్షుద్ర పూజల కలకలం.. కాంగ్రెస్ నేతలకు హరీశ్ రావు లీగల్ నోటీసులు!
గదిలో కీలక ఆధారాల స్వాధీనం: అశోక్‌నగర్‌లోని ఉదయ్ కృష్ణారెడ్డి గదిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఒక ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, రెండు ప్రేమలేఖలతో పాటు ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ ఆధారాల ఆధారంగా పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. శిక్షణ సమయంలోనూ ఉదయ్ కృష్ణారెడ్డి తన విపరీతమైన ప్రవర్తనతో తోటి శిక్షకులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు విచారణాధికారులు వెల్లడించారు.

