- సింగరేణి ఏరియా హాస్పిటల్లో రోగుల అవస్థలు
- ఓపీ ఒకచోట.. వైద్యం మరోచోట
- గర్భిణీలకు పరీక్షల పేరుతో పరుగులు.. గంటల తరబడి నిరీక్షణ
- స్కానింగ్ సెంటర్ లేక ప్రైవేట్ కేంద్రాలకు రెఫర్
- వైద్యుల కొరత తీర్చాలని కార్మిక సంఘం డిమాండ్
రామగుండం, అక్టోబర్ 5 (తెలుగు ప్రభ): ప్రకృతికి విరుద్ధంగా ఊపిరాడని భూగర్భ బొగ్గు గనుల్లో శ్రమిస్తూ చెమటోడ్చి బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సింగరేణి కార్మికుల కుటుంబాలకు ఏరియా హాస్పిటల్లో వైద్యం కోసం వెళ్లినా ఇబ్బందులు తప్పడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓపీ ఒకచోట, వైద్యం మరోచోట ఉండటంతో అటు ఇటు తిరగాల్సి వస్తోందని వాపోతున్నారు. అనారోగ్యంతో క్యూలో నిలబడి గంటల తరబడి వైద్యుల కోసం నిరీక్షించాల్సి వస్తోందని చెబుతున్నారు.
వైద్యులు పరీక్షించిన అనంతరం అరకొర మందులు రాస్తూ పంపిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. సింగరేణి ఏరియా హాస్పిటల్లో అత్యాధునిక వైద్య పరికరాలతో సేవలు అందిస్తున్నామని యాజమాన్యం పేర్కొంటున్నప్పటికీ, రోగుల అవస్థలు మాత్రం వర్ణనాతీతంగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్య బృందంతో సేవలు అందిస్తున్నట్లు యాజమాన్యం చెబుతున్నప్పటికీ, ప్రతిరోజూ ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల ఇబ్బందులను అర్థం చేసుకోవడం లేదని రోగులు అంటున్నారు. మొక్కుబడి వైద్యం అందుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గర్భిణుల అవస్థలు అంతా ఇంతా కాదు
కోట్లాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక పరికరాలు సమకూర్చిన యాజమాన్యం ఏరియా హాస్పిటల్లో స్కానింగ్ సెంటర్ ఏర్పాటు చేయకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గర్భిణీ మహిళల గర్భంలోని శిశువు కదలికలను తెలుసుకునేందుకు స్కానింగ్ మిషన్ అవసరం ఉన్నప్పటికీ, ఆసుపత్రిలో ఆ సదుపాయం లేకపోవడం శోచనీయమని రోగుల బంధువులు అంటున్నారు. గైనకాలజిస్టు వైద్యులు గర్భిణీ మహిళలను లక్ష్మీనగర్‌లోని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌కు పంపుతున్నారని చెబుతున్నారు. దీంతో గర్భిణీలు వాహనాలు లేక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోందని, అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ స్కానింగ్ చేయించుకున్న తర్వాత మళ్లీ ఆసుపత్రికి వచ్చి రిపోర్టులను గైనకాలజిస్టుకు చూపించాల్సి వస్తోందని అంటున్నారు.
సింగరేణి కార్మికుల పెళ్లైన కూతుళ్లు, ఉద్యోగుల సతీమణులు గైనకాలజిస్టు వద్ద చెకప్ కోసం వెళ్లినప్పుడు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. ముందుగా గైనిక్ ఓపీ-12కి వెళ్లి బీపీ పరీక్ష చేయించుకోవాలి. అనంతరం పావుగంట పాటు లైన్లో వేచి ఉండాలి. ఆ తర్వాత గైనకాలజిస్టు పరీక్షిస్తారు. ప్రైవేట్ స్కానింగ్ సెంటర్‌కు రిఫర్ చేస్తారు. స్కానింగ్ చేయించుకున్న తర్వాత రిపోర్టుతో మళ్లీ ఆసుపత్రికి రావాలి. అనంతరం స్కానింగ్ ఓపీ-2కి వెళ్లాలని సూచిస్తారు. అక్కడి నుంచి మళ్లీ గైనకాలజిస్టు వద్దకు వెళ్లాలి. రిపోర్టు పరిశీలించిన తర్వాత లేబర్ రూమ్-55కి పంపుతున్నారని గర్భిణీలు వాపోతున్నారు.
ఈ క్రమంలో గర్భిణీ మహిళలు ఆసుపత్రిలో అటు ఇటు తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. లేబర్ రూమ్ వద్ద సిబ్బంది, మహిళా సెక్యూరిటీ గార్డులు చీదరించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. గర్భిణీల పట్ల గౌరవంగా వ్యవహరించకుండా, కనీస సహాయం కూడా అందించడం లేదని అంటున్నారు. ప్రస్తుతం ఒకే గైనకాలజిస్టు ఉండటంతో చాలామంది గర్భిణులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రోగుల బంధువులు చెబుతున్నారు. నొప్పులు ఎక్కువైన సమయంలో అటు ఇటు తిరగాల్సి రావడం ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు.
స్పందించని అడిషనల్ సీఎంఓ
ఏరియా హాస్పిటల్లో ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వివరణ కోసం సోమవారం ‘తెలుగు ప్రభ’ విలేకరి అడిషనల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్‌ను సంప్రదించగా, సమాధానం దాటవేస్తూ వ్యవహరించారని పేర్కొన్నారు. గైనకాలజిస్టు కోసం ఆసుపత్రికి వచ్చే గర్భిణీ మహిళలు ఉదయం 9 గంటలకు వస్తే తిరిగి సాయంత్రం 4 గంటలకు ఇంటికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని రోగులు చెబుతున్నారు. గంటల తరబడి అవస్థలు పడుతున్నప్పటికీ, సమస్యలను ఏరియా హాస్పిటల్ ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.
ఇటీవల ఓ గైనకాలజిస్టు వైద్యురాలి నిర్లక్ష్యం వల్ల సకాలంలో చికిత్స అందక గర్భిణీ స్త్రీకి జన్మించిన పాప మృతి చెందిందని, దీంతో ఆసుపత్రిలో కార్మిక సంఘాలు, కార్మికులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. డాక్టర్ల కొరత తీర్చాలని, గైనకాలజిస్టు వైద్యుల నిర్లక్ష్యం వల్ల గర్భిణీలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఉన్నతాధికారులను కోరారు. అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.
గని ప్రమాదంలో గాయపడిన వారికీ ఇబ్బందులు
గని ప్రమాదాల్లో గాయపడిన కార్మికులను సకాలంలో అంబులెన్స్‌లో ఆసుపత్రికి తీసుకొచ్చినా వైద్యులు అందుబాటులో ఉండి కూడా నిర్లక్ష్యంగా వైద్యం అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో కార్మికుల పరిస్థితి విషమించిన తర్వాత హైదరాబాద్, కరీంనగర్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులకు రిఫర్ చేస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.
వైద్యుల కొరత తీర్చండి
సింగరేణి ఏరియా హాస్పిటల్లో వైద్య సేవల సమస్యలను పరిష్కరించాలని, కార్మికులు, వారి కుటుంబాల పట్ల వైద్యులు నిజాయితీగా సేవలు అందించాలని ఐఎన్టీయూసీ ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ గచ్చకాయల సదానందం కోరారు. కార్మికుల కష్టార్జితంతో సంస్థ లాభాలు గడిస్తోందని, అలాంటి కార్మికులు అనారోగ్యంతో ఆసుపత్రికి వస్తే వారిని పూర్తిగా పరీక్షించి మెరుగైన మందులు అందించాలని కోరారు. గైనకాలజిస్టు వైద్యులను నియమించాలని డిమాండ్ చేశారు. ఒకే గైనకాలజిస్టు ఉండటంతో గర్భిణీ మహిళలు ఇబ్బందులు పడుతున్నారని, వారి కోసం మరింత మంది వైద్యులను నియమించాలని కోరారు.
కోట్లాది రూపాయలతో క్యాథ్ ల్యాబ్, సీటీ స్కాన్, ఎక్స్‌రే తదితర అత్యాధునిక సాంకేతిక పరికరాలను ఏర్పాటు చేసిన సింగరేణి యాజమాన్యం.. కార్మికుల కుటుంబాలు, వారి కూతుళ్లు, గర్భిణీ స్త్రీలు గైనకాలజిస్టు వైద్యుల కోసం వస్తే గంటల తరబడి అటు ఇటు తిప్పడం సరికాదన్నారు. గర్భిణీ మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులు పరిష్కరించాలని, వారికి సహాయకులను ఏర్పాటు చేయాలని కోరారు. గర్భిణీ మహిళల పట్ల ఆసుపత్రి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు చీదరించుకోవడం మానుకోవాలని హెచ్చరించారు. సింగరేణి ఆసుపత్రిలో మందుల కొరత, వైద్యుల కొరత, గర్భిణీ మహిళల అవస్థలను ఐఎన్టీయూసీ తరఫున సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ద్వారా సింగరేణి సీఎండీ, డైరెక్టర్ (పా), ఇతర డైరెక్టర్ల దృష్టికి తీసుకెళ్తామని సదానందం తెలిపారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

