Special movie on Revanth Reddy political journey: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పొలిటికల్ జర్నీపై తీసిన “ఒక యోధుని ప్రజాపాలన” అనే చిత్రం ఇవాళ విడుదలైంది. రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం, ఆయన నేతృత్వంలోని ప్రజాపాలన ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇవాళ సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్ (స్క్రీన్-1)లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తూ గిరి నల్ల దర్శకత్వం వహించారు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించగా, అలోషియస్ జేవియర్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సీఆర్ కుమార్ సహ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎం ఓఎస్డీ నేరెవెట్ల కోదండరామ రెడ్డి, అనంత్ నకిరేకంటి ప్రత్యేక సహకారం అందించారు.
Also read: https://teluguprabha.net/telangana/bandi-sanjay-son-in-pocso-case/
ప్రజా సమస్యలే ఇతివృత్తంగా సినిమా..
సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటంతో పాటు సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థులు, వృద్ధుల ఛాయాచిత్రాలతో విడుదలైన పోస్టర్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటిని పరిష్కరించే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, ఒక నాయకుడిగా రేవంత్ రెడ్డి ఎదిగిన తీరును ఈ చిత్రంలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ప్రజాపాలనలో ముఖ్యమంత్రి ముద్రను, ఆయన పోరాట పటిమను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ చిత్రం రాజకీయ, సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ చిత్రం రేవంత్ పాలనకు మంచి మైలేజీని ఇస్తుందని భావిస్తున్నారు.

