Telangana-Holidays:తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు మరోసారి భారీ శుభవార్త అందింది. ఈ నెల సెప్టెంబర్ 5వ తేదీ నుంచి వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు లభించనున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు విడుదల చేసిన జీవో నంబర్ 1205 ప్రకారం, హైదరాబాదు, సికింద్రాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈ మూడు రోజులలో ప్రత్యేకంగా సెలవులు వర్తిస్తాయి.
మిలాద్ ఉన్ నబీ పండుగ..
మొదటగా సెప్టెంబర్ 5వ తేదీ గురువారం మిలాద్ ఉన్ నబీ పండుగ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు ప్రకటించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఈ పండుగ రోజు ప్రతి సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున జరుపుకుంటారు.
గణేష్ నిమజ్జన శోభాయాత్ర..
దీనికి తరువాత రోజు సెప్టెంబర్ 6వ తేదీ శనివారం గణేష్ నిమజ్జన శోభాయాత్ర జరుగనుంది. ఈ సందర్భంగా భారీగా భక్తులు పాల్గొనే అవకాశం ఉండటంతో ట్రాఫిక్, భద్రతా కారణాల దృష్ట్యా ప్రభుత్వం సెలవు ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా హైదరాబాదు, సికింద్రాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని పాఠశాలలు, కళాశాలలు, కార్యాలయాలు ఈ ఆదేశాల పరిధిలోకి వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున సాధారణ సెలవు ప్రకటించింది.
వరుసగా మూడురోజులు..
ఆ తరువాత సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం. సాధారణంగా ప్రతి ఆదివారం విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. ఇలా వరుసగా మూడురోజులు విద్యార్థులు విశ్రాంతి పొందే అవకాశం లభించింది. ఈ మూడు రోజుల సెలవులు విద్యార్థులకు మానసికంగా కూడా ఉపశమనం కలిగిస్తాయని భావిస్తున్నారు.
అయితే ప్రభుత్వం 6వ తేదీ సెలవు గురించి ఒక ప్రత్యేక నిర్ణయం కూడా తీసుకుంది. ఆ రోజు ఇచ్చిన సెలవును అక్టోబర్ 11న రెండో శనివారం వర్కింగ్ డేగా భర్తీ చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా రెండో శనివారం ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఉంటుంది. కానీ ఈసారి మాత్రం అన్ని విభాగాలు యథావిధిగా పనిచేయాల్సి ఉంటుంది.

