Supreme Court Sensational verdict: తల్లిదండ్రులపై ఆధారపడి జీవిస్తున్న వివాహిత కుమార్తెలకు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీపి కబురు చెప్పింది. వివాహిత కుమార్తె కూడా కారుణ్య నియామకానికి అర్హులేనని చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా మరణిస్తే, వారసులకు ఇచ్చే కారుణ్య నియామకానికి వివాహిత కుమార్తె కూడా పూర్తి అర్హులేనని న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. కేవలం పెళ్లి అయిందనే ఒకే ఒక్క కారణంతో మహిళలకు రాజ్యాంగం ఇచ్చిన హక్కును కాలరాయలేమని స్పష్టం చేసింది. సర్వీసులో ఉన్న ఉద్యోగి అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో కారుణ్య నియామకాల పథకాన్ని ప్రవేశపెట్టారు. అయితే, ప్రస్తుత నిబంధనల ప్రకారం, కేవలం కుమారులు లేదా అవివాహిత కుమార్తెలకు మాత్రమే ఈ అవకాశం కల్పిస్తూ, పెళ్లయిన కుమార్తెలను పూర్తిగా మినహాయిస్తూ వచ్చారు. ఈ రకంగా వివాహిత మహిళలపై వివక్ష చూపడాన్ని సుప్రీం కోర్టు తప్పు పట్టింది.
అవివాహిత పదాన్ని తక్షణమే తొలగించండి..
కేవలం వివాహమైందన్న కారణంతో కుమార్తెలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వకపోవడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. వివాహం అనేది మహిళ అర్హతలను గానీ, ఆమె బాధ్యతలను గానీ ఏమాత్రం మార్చలేవని అభిప్రాయపడింది. వివాహం అయినంత మాత్రాన తన తల్లిదండ్రులు, కుటుంబంతో ఆమెకున్న అనుబంధం తెగిపోదని గుర్తు చేసింది. అందువల్ల, కారుణ్య నియామకాల్లో కుమారులతో సమానంగా వివాహిత కుమార్తెలకు కూడా సమానమైన అర్హత, హక్కులు ఉంటాయని తేల్చి చెప్పింది. కాగా, తాజా తీర్పుతో ఇకపై దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు తమ కారుణ్య నియామక నిబంధనల్లో సడలింపు చేయాల్సి ఉంటుంది. ‘అవివాహిత’ అనే పదాన్ని తక్షణమే తొలగించాల్సి ఉంటుంది. ఆ స్థానంలో వివాహిత కుమార్తెలను కూడా చేర్చి జీవో సడలించాల్సి ఉంటుంది. సమాజంలో లింగ సమానత్వాన్ని పెంపొందించే దిశగా, మహిళా హక్కులకు భంగం వాటిళ్లకుండా ఈ తీర్పు ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తుందని సుప్రీం తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చారిత్రాత్మక తీర్పుతో దేశవ్యాప్తంగా ఎన్నో ఏళ్లుగా న్యాయం కోసం వేచి చూస్తున్న బాధిత మహిళలకు న్యాయం జరగనుంది.

