- స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు రాష్ట్ర ప్రజలకే అవమానం
- కేసీఆర్ క్షమాపణ చెప్పాలి.. తాతా మధుతో రాజీనామా చేయించాలి
- తెలంగాణకు ఇది చీకటి రోజు.. రాజకీయాలకు అతీతంగా దీన్ని ఖండించాలి
- చీకటి మిత్రులను కాపాడేందుకు బీజేపీ యత్నం
- సభా సంప్రదాయాలు, స్పీకర్ చైర్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
- సంయమనం పాటిస్తే చేతగాని తనంగా భావించొద్దు
- వ్యవస్థలను బెదిరించి లొంగదీసుకుంటామంటే చూస్తూ ఊరుకోం
- అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 7 (తెలుగుప్రభ): స్పీకర్ చైర్‌ను అవమానించేలా అత్యంత అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడం క్షమించరాని నేరమని, తాతా మధును తక్షణమే చట్టసభ నుంచి డిస్మిస్ చేయాలని, లేదంటే ఆయనతో రాజీనామా చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ ఈ ఘటనపై తెలంగాణ ప్రజలకు, సభకు క్షమాపణ చెప్పాలని సభా నాయకుడిగా డిమాండ్ చేస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు. స్పీకర్‌కు జరిగిన అవమానం కేవలం వ్యక్తిగత అవమానం కాదని, అది మొత్తం శాసనసభకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానమని రేవంత్‌రెడ్డి అన్నారు. సభాపతి స్థానానికి అత్యున్నత గౌరవం ఉందని, ముఖ్యమంత్రి అయినా, సాధారణ శాసనసభ్యుడైనా స్పీకర్ ముందు సమానమేనని పేర్కొన్నారు. సభా సంప్రదాయాలను, చట్టసభల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సోమవారం అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. స్పీకర్‌ను ఉద్దేశించి సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడటం దురదృష్టకరమని, ఇది కేవలం దళితుడైన స్పీకర్‌కు జరిగిన అవమానం కాదని, సభ్యసమాజానికే జరిగిన అవమానమని స్పష్టం చేశారు. స్పీకర్ చైర్‌ను గౌరవించడం మన ప్రజాస్వామ్య, శాసనసభ సంప్రదాయమని, ఆ స్థానాన్ని అవమానిస్తే రాజకీయాలకు అతీతంగా అందరూ ముక్తకంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందన్నారు.
కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
తాతా మధు వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తక్షణమే క్షమాపణ చెప్పాలని సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ నేతలు తాము ఏం మాట్లాడినా తమ వెనుక కేసీఆర్ ఉన్నారనే ధైర్యంతో ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిన్న కేసీఆర్ బీఆర్‌ఎస్ సభ్యులను పిలిపించి, స్పీకర్‌పై దూషణలకు ఉసిగొల్పి పంపించారని సీఎం ఆరోపించారు. ఇది అనాలోచితంగా జరిగిన ఘటన కాదని, పథకం ప్రకారమే జరిగిందని వ్యాఖ్యానించారు. తల్లిని అవమానించేలా మాట్లాడితే ఎవరికైనా రక్తం మరగదా? స్పీకర్‌కు జరిగిన అవమానం మా అందరికీ జరిగిన అవమానంగానే భావిస్తున్నాం అని సీఎం అన్నారు. ప్రభుత్వం సంయమనం పాటిస్తే దాన్ని చేతగానితనంగా భావించవద్దని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. అదిరించి, బెదిరించి వ్యవస్థలను లొంగదీసుకుంటామంటే చూస్తూ ఊరుకోమని స్పష్టం చేశారు. కొంతమంది ఏం చేసినా తమను తమ నాయకుడు కాపాడుతాడనే అహంకారంతో వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
సభలో చర్చ తర్వాతే నిర్ణయాలు
శాసనసభలో చర్చలు జరిగిన తర్వాతే నిర్ణయాలు జరుగుతాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. చర్చ జరగకముందే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేయడం సరైన పద్ధతి కాదన్నారు. బీజేపీ లేవనెత్తిన అంశాలపై కూడా కూలంకషంగా చర్చించిన తర్వాతే సభ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ‘ఇదే సభలో కాళేశ్వరం అంశంపై చర్చించాం. చర్చ అనంతరం విచారణకు ఆదేశించాం. ప్రజాస్వామ్యంలో చర్చ జరిగిన తర్వాత నిర్ణయం వస్తుంది. నిర్ణయం తీసుకున్న తర్వాత చర్చ జరగదు’ అని సీఎం పేర్కొన్నారు. బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ)లో నిర్ణయించిన ప్రకారం అన్ని అంశాలపై చర్చిస్తామని, అయితే ప్రస్తుతానికి స్పీకర్ చైర్ గౌరవానికి సంబంధించిన అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్ సభ్యులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ ఎందుకు సమర్థిస్తోందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ‘బీఆర్‌ఎస్ చేసిన అపవాదులు, దుర్మార్గాలను బీజేపీ ఎందుకు మోస్తోంది? చీకటి మిత్రులను కాపాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తోంది’? అని ముఖ్యమంత్రి నిలదీశారు. స్పీకర్ చైర్‌ను అవమానించిన అంశంపై చర్చకు బీజేపీ సభ్యులు సహకరించాలని కోరారు. ఈ అంశంపై చర్చ పూర్తయిన తర్వాత బీజేపీ లేవనెత్తిన ఇతర అంశాలపైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
దళితులను మోసం చేసింది కేసీఆరే
బీఆర్‌ఎస్‌ది దళిత వ్యతిరేక ఆలోచన, దళిత వ్యతిరేక వైఖరి అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని, ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని హామీ ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. దళిత బంధు ఇస్తామని హామీ ఇచ్చి, దళిత ఉప ముఖ్యమంత్రిని పదవి నుంచి తొలగించిన ఘనత కూడా కేసీఆర్‌దేనని అన్నారు. నేరెళ్ల ఘటనలో ఇసుక లారీలను అడ్డుకున్న దళితులపై తీవ్రంగా వ్యవహరించారని ఆరోపించారు. ఒక దళితుడిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకుంటే.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఆయనకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారని బీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. దళిత వ్యక్తిని ప్రతిపక్ష నాయకుడిగా చూడలేకపోతున్నారని సీఎం ఆరోపించారు. బీఆర్‌ఎస్ తన దళిత వ్యతిరేక ఆలోచనా విధానాన్ని మార్చుకోకపోతే భవిష్యత్ తరాలు ఆ పార్టీని, ఈ సభలో జరిగిన పరిణామాలను క్షమించవని హెచ్చరించారు. తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేసీఆర్ క్షమాపణ చెప్పే వరకు ఈ అంశాన్ని వదిలిపెట్టబోమని సీఎం తన ప్రసంగంలో స్పష్టం చేశారు.

