HomeతెలంగాణTelangana:టీసీ లేకున్నా అడ్మిషన్‌ ఇవ్వాల్సిందే

Telangana:టీసీ లేకున్నా అడ్మిషన్‌ ఇవ్వాల్సిందే

ఆధార్‌, బర్త్‌ సర్టిఫికెట్‌, పీఈఎన్‌ కోసం విద్యార్థులను వెనక్కి పంపొద్దు
డ్రాప్‌అవుట్‌, వలస కార్మికుల పిల్లలకూ ప్రవేశం నిరాకరించకూడదు
నిబంధనలు ఉల్లంఘిస్తే హెచ్‌ఎంలపై క్రమశిక్షణ చర్యలు
డీఈవోలకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు

- Advertisement -

హైదరాబాద్‌,  (తెలుగుప్రభ): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల అడ్మిషన్లకు టీసీ, ఆధార్‌, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, పీఈఎన్‌ నంబర్‌ వంటి పత్రాలను అడ్డంకిగా మారుస్తున్న వ్యవహారంపై పాఠశాల విద్యాశాఖ సీరియస్‌గా స్పందించింది. ఇతర పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులు ముందుగానే అన్ని ధ్రువపత్రాలు సమర్పించాలంటూ పట్టుబట్టడం సరికాదని స్పష్టం చేసింది. పత్రాలు లేవనే కారణంతో రెగ్యులర్‌ విద్యార్థులతో పాటు డ్రాప్‌అవుట్‌ పిల్లలకు కూడా ప్రవేశం నిరాకరించకూడదని ఆదేశించింది. గత ఏడాది నవంబర్‌ 14న పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ జిల్లా విద్యాధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

అయితే ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరంలోనూ కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితిలో మార్పు కనిపించడం లేదని, టీసీ, ఇతర ధ్రువపత్రాల పేరుతో విద్యార్థులను వెనక్కి పంపుతున్నట్లు విద్యాశాఖ దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అంశంపై అధికారులు మరోసారి దృష్టి సారించారు. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు మారే విద్యార్థులకు టీసీ విషయంలో విద్యాశాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఆర్‌టీఈ చట్టం – 2009లోని సెక్షన్‌ 5(2), 5(3) ప్రకారం విద్యార్థికి మరో పాఠశాలలో చేరే హక్కు ఉందని పేర్కొంది.

గతంలో చదివిన పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లేదా ఇన్‌చార్జి టీసీని వెంటనే జారీ చేయాలి. అయితే టీసీ జారీ చేయడంలో జాప్యం జరిగితే దానిని కారణంగా చూపి కొత్త పాఠశాలలో ప్రవేశాన్ని ఆలస్యం చేయడం లేదా నిరాకరించడం చట్టబద్ధం కాదని విద్యాశాఖ స్పష్టం చేసింది. టీసీ జారీ చేయడంలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేసే హెచ్‌ఎంలపై సంబంధిత సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని హెచ్చరించింది.

పత్రాలు తర్వాత.. అడ్మిషన్‌ ముందు
పుట్టిన తేదీకి సంబంధించిన ఆధారం లేకపోయినా విద్యార్థికి ప్రవేశం నిరాకరించకూడదని ఆర్‌టీఈ చట్టం స్పష్టం చేస్తోందని విద్యాశాఖ తెలిపింది. ఆధార్‌, బర్త్‌ సర్టిఫికెట్‌, పీఈఎన్‌, టీసీ వంటి పత్రాలు లేకున్నా ముందుగా విద్యార్థిని పాఠశాలలో చేర్చుకోవాలని సూచించింది. అవసరమైన పత్రాలను తర్వాత సమకూర్చుకునేలా పాఠశాల సిబ్బంది సహకరించాలని ఆదేశించింది. ప్రతి పాఠశాలలో ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు ఒక సిబ్బందిని బాధ్యుడిగా నియమించాలని కూడా సూచించింది.

పత్రాల కోసం విద్యార్థులను పాఠశాలల చుట్టూ తిప్పడం వల్ల ముఖ్యంగా వలస కార్మికుల పిల్లలు, డ్రాప్‌అవుట్‌ విద్యార్థులు, ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మారే కుటుంబాల పిల్లలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు గుర్తించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలు తమ పరిధిలోని మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులకు నిబంధనలను స్పష్టంగా తెలియజేసి అమలు చేయించాలని విద్యాశాఖ ఆదేశించింది. మరోవైపు విద్యాశాఖ ఆదేశాలపై కొన్ని ఉపాధ్యాయ వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

విద్యార్థుల వివరాలను పాఠశాల రికార్డుల్లో నమోదు చేయడం, యూడైస్‌ వంటి విద్యా డేటాబేస్‌లలో వివరాలు పొందుపరచడం, వయసు, విద్యా స్థాయిని నిర్ధారించడం వంటి అంశాల్లో తర్వాత పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News