TCS Hyper Vault Hyderabad AI data center : భాగ్యనగర ఖ్యాతిని విశ్వవేదికపై మరోసారి రెపరెపలాడిస్తూ సాంకేతిక రంగంలో నవశకానికి నాంది పడనుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విప్లవానికి హైదరాబాద్ సరికొత్త కేంద్రబిందువుగా మారబోతోందా? అధికార వర్గాల సమాచారం ప్రకారం అవుననే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. దేశంలోనే భారీ ప్రాజెక్టుకు తెరలేపుతూ, ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ ఏఐ మౌలిక విభాగమైన ‘హైపర్‌వాల్ట్’ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం మరికాసేపట్లో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డితో సచివాలయంలో కీలక భేటీ కానుంది.
రూ.70 వేల కోట్ల భారీ పెట్టుబడి: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగానికి పెద్దపీట వేస్తున్న వేళ, టీసీఎస్-టీపీజీ భాగస్వామ్యంతో కూడిన ‘హైపర్‌వాల్ట్’ భాగ్యనగరంలో కనీవినీ ఎరుగని రీతిలో 1 గిగావాట్ (GW) సామర్థ్యంతో మెగా ఏఐ డేటా సెంటర్ క్యాంపస్‌ను ప్రతిపాదిస్తోంది. దాదాపు 250 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో నెలకొల్పే ఈ బృహత్తర ప్రాజెక్టు కోసం ఏకంగా రూ.70,000 కోట్ల మూలధన వ్యయం చేయనున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.
ఉద్యోగాల వెల్లువ.. ఆర్థిక వృద్ధికి ఊతం: ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చితే రాష్ట్రానికి దాదాపు 7,000 ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ స్థాయి ఏఐ కంప్యూటింగ్, క్లౌడ్ మౌలిక వసతులు సమకూరి, ఫ్యూచర్ సిటీ ప్రణాళికలకు దన్నుగా నిలుస్తుంది. తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యానికి ఇది బంగారు బాటగా మారనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

