Telangana 22A property registration update : గత కొద్దిరోజులుగా స్థిరాస్తి క్రయవిక్రయదారులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన 22(ఎ) నిషేధిత ఆస్తుల వివాదంలో ఎట్టకేలకు కదలిక వచ్చింది. ప్రైవేటు ఆస్తులు సైతం నిషేధిత జాబితాలోకి చేరిపోవడంతో గందరగోళంలో పడ్డ సామాన్య ప్రజలకు, కొనుగోలుదారులకు ప్రభుత్వం తాజా నిర్ణయంతో ఊరట కల్పించింది. వివాదాస్పద ఆస్తుల జాబితా నుంచి అర్హమైన ప్రైవేటు భూములను తొలగిస్తూ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అధికారులు పునఃప్రారంభించారు. మరోవైపు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి, వ్యవస్థను గందరగోళానికి గురిచేసిన ఉన్నతాధికారుల తీరుపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బదిలీల వేటు వేసింది.
ఊపిరి పీల్చుకున్న యజమానులు.. వేగంగా స్లాట్ల నమోదు : ప్రభుత్వ ఆదేశాల మేరకు 22(ఎ) నిషేధిత జాబితాలో చిక్కుకున్న ప్రైవేటు ఆస్తులను వేరుచేసి, వాటి రిజిస్ట్రేషన్లను పూర్తి చేసే ప్రక్రియ సోమవారం నుంచి ఊపందుకుంది. క్షేత్రస్థాయిలో యజమానులు సమర్పించిన పత్రాలు, ఆధారాలను పరిశీలించిన రెవెన్యూ-రిజిస్ట్రేషన్ల శాఖలు ఆయా ఆస్తులను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాయి.
నిబంధనల ప్రకారం మంగళవారం నాటికి రంగారెడ్డి జిల్లాలో 4, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 30 ప్రైవేటు ఆస్తులకు 22(ఎ) నుంచి విముక్తి కల్పించి, మొత్తం 34 రిజిస్ట్రేషన్లను విజయవంతంగా పూర్తి చేశారు. ఆస్తుల తొలగింపు పూర్తయిన వెంటనే యజమానులు స్లాట్ బుక్ చేసుకునే సదుపాయం కల్పించడంతో రిజిస్ట్రేషన్లు వేగవంతమయ్యాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల్లో స్తంభించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కడంతో క్రయవిక్రయదారుల్లో హర్షం వ్యక్తమవుతోంది.
22(ఎ) జాబితా అంటే ఏమిటి? సాంకేతిక తప్పిదం ఎలా జరిగింది? : భారత స్టాంపులు, రిజిస్ట్రేషన్ల చట్టం ప్రకారం ప్రభుత్వానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ ‘ప్రొహిబిషన్ ఆఫ్ బుక్’ (నిషేధిత జాబితా పుస్తకం)ను నిర్వహిస్తుంది.
చేర్చే భూములు: అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్, అటవీ, నీటిపారుదల, ఇనాం, రెవెన్యూ, అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యూఎల్సీ), భూదాన్ భూములతో పాటు ప్రభుత్వం సేకరించిన ప్రైవేటు భూముల సర్వే నంబర్లను ఇందులో నమోదు చేస్తారు.
తొలగించాల్సిన భూములు: ప్రభుత్వం నిధుల సమీకరణ కోసం వేలంలో విక్రయించిన భూములు, జీవోల ద్వారా క్రమబద్ధీకరించిన (Regularized) ఆస్తులను ఈ జాబితా నుంచి తొలగించాల్సి ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి నుంచి ఇలాంటి భూముల విక్రయాలు చాలావరకు మాన్యువల్‌గా (కాగితాలపై) రిజిస్ట్రేషన్ అయ్యాయి కానీ, ఆన్‌లైన్ డేటాబేస్‌లో సరిగ్గా అప్‌డేట్ కాలేదు. ఇటీవల హైకోర్టు ఆదేశాల మేరకు రికార్డులను ఆధునీకరించే క్రమంలో అధికారులు గుడ్డిగా పాత డేటాను యథాతథంగా అప్‌లోడ్ చేయడంతో, వేల సంఖ్యలో ప్రైవేటు ఆస్తులు సైతం నిషేధిత జాబితాలోకి చేరిపోయాయి.
కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రక్షాళన – ఆధారాల అప్‌లోడ్ : ఈ తప్పిదం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. సంబంధిత జిల్లాల కలెక్టర్లు రంగంలోకి దిగి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల వివరాలను వేరుచేసే కసరత్తును ముమ్మరం చేశారు. బాధితుల నుంచి దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత లింక్ డాక్యుమెంట్లు, ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులను పరిశీలిస్తున్నారు. అర్హమైన ప్రైవేటు ఆస్తులని నిర్ధారించుకున్న తర్వాత క్షేత్రస్థాయి సిబ్బంది ఆ ఆధారాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేస్తూ నిషేధం నుంచి తొలగిస్తున్నారు.
అధికారులపై కొరడా: బదిలీల వేటు.. కలెక్టర్ తీరుపైనా విచారణ : విషయం తీవ్రతను గుర్తించడంలో విఫలమై, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులపై ప్రభుత్వం కఠిన వైఖరి అవలంబించింది. హైదరాబాద్ జిల్లా (దక్షిణం) రిజిస్ట్రార్, డీఐజీ తులసిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆమె స్థానంలో రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రార్ ఎం.రవీందర్ రావుకు బాధ్యతలు అప్పగించింది.
అదనపు బాధ్యతల మార్పు: రవీందర్ రావు అదనంగా చూస్తున్న ఖమ్మం జిల్లా రిజిస్ట్రార్ బాధ్యతలను నల్గొండ జిల్లా రిజిస్ట్రార్‌కు బదిలీ చేసింది. బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రార్ సిరాజ్‌ను చిట్స్ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఓ జిల్లా కలెక్టర్‌పై ఆరా: నిషేధిత జాబితా సమస్యలు ఇంత భారీగా పేరుకుపోవడానికి ఓ కీలక జిల్లా కలెక్టర్ అలసత్వమే ప్రధాన కారణమని ప్రభుత్వం గుర్తించినట్లు సమాచారం. ఆ జిల్లాలో ఏయే సర్వే నంబర్లను చేర్చారు? వేటిని తొలగించారు? అనే అంశాలపై లోతుగా విచారణ సాగుతోంది. ఆ కలెక్టర్‌పై తక్షణమే బదిలీ వేటు వేయాలని భావించినప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న పరిపాలనాపరమైన/సర్వే ప్రక్రియల నేపథ్యంలో తాత్కాలికంగా వాయిదా వేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. సదరు ప్రక్రియ ముగియగానే సదరు అధికారిపై చర్యలు ఉంటాయని తెలుస్తోంది.

