HomeతెలంగాణAnganwadi jobs: అంగన్‌వాడీల్లో కొలువులు.. 15,982 పోస్టుల భర్తీకి సర్కారు సన్నద్ధం

Anganwadi jobs: అంగన్‌వాడీల్లో కొలువులు.. 15,982 పోస్టుల భర్తీకి సర్కారు సన్నద్ధం

Telangana Anganwadi Recruitment Notification : తెలంగాణలోని నిరుద్యోగ మహిళలకు రాష్ట్ర సర్కారు త్వరలోనే తీపికబురు అందించనుంది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగ కల సాకారం కాబోతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ఏకంగా 15,982 పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల నియామకాలకు సంబంధించి జిల్లాల వారీగా త్వరలోనే నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. 

- Advertisement -

ఖాళీల లెక్క – భర్తీ పక్కా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35,781 అంగన్‌వాడీ కేంద్రాల్లో దాదాపు 71,562 మంది సిబ్బంది (టీచర్లు, సహాయకులు) పనిచేయాల్సి ఉంది. అయితే గత మూడేళ్లుగా పదవీ విరమణలు, సూపర్ వైజర్లుగా ప్రమోషన్లు రావడం, మరికొందరికి ఇతర విభాగాల్లో శాశ్వత ఉద్యోగాలు రావడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి. తాజా గణాంకాల ప్రకారం 2025-26 నాటికి ఈ ఖాళీల సంఖ్య 15,982కి చేరింది. అంటే మొత్తం పోస్టుల్లో ఏకంగా 22.33 శాతం ఖాళీగా ఉన్నాయి.

Also Read: https://teluguprabha.net/crime-news/hyderabad-shamshabad-airport-customs-seize-10-kg-ganja-from-bangkok-passenger/

సహాయకుల పోస్టులు (ఆయాలు): 12,882
టీచర్ పోస్టులు: 3,100

ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన విద్యార్హతలు, నియామక ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. కొత్త రిక్రూట్‌మెంట్ విధానానికి ఆమోదం లభించిన వెంటనే ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ముమ్మరంగా నోటిఫికేషన్లు జారీ కానున్నాయి.

సౌకర్యాల లేమికి చెక్ – పటిష్టంగా మౌలిక వసతులు : కేవలం కొలువుల భర్తీతో సరిపెట్టకుండా, అంగన్‌వాడీ కేంద్రాల రూపురేఖలు మార్చేందుకు యంత్రాంగం నడుంబిగించింది. అద్దె భవనాల్లో కేంద్రాలు కొనసాగడానికి వీల్లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే స్పష్టం చేసిన నేపథ్యంలో, ఈ ఏడాది బృహత్తర కార్యచరణకు శ్రీకారం చుట్టారు.

Also Read: https://teluguprabha.net/telangana/22-people-die-due-to-sunstroke-in-telangana/

పక్కా భవనాలు: తొలి విడతగా వెయ్యి కేంద్రాలకు నూతన శాశ్వత భవనాల నిర్మాణం.
డిజిటల్ వసతులు: 5,000 కేంద్రాల్లో ఆర్వో (RO) ప్లాంట్లు, ఎల్‌ఈడీ (LED) స్క్రీన్ల ఏర్పాటు.
కనీస సౌకర్యాలు: 7,700 కేంద్రాలకు వాష్‌రూమ్స్, 9 వేల కేంద్రాలకు విద్యుత్, 3,300 కేంద్రాలకు తాగునీటి కనెక్షన్లు.

రెట్టింపైన ప్రోత్సాహకాలు – ‘తొలిముద్ద’తో ఆరోగ్యం : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు అంగన్‌వాడీ సిబ్బందికి పదవీ విరమణ ప్రయోజనాలను రెట్టింపు చేసింది. గతంలో రిటైర్మెంట్ సమయంలో టీచర్లకు రూ.లక్ష, సహాయకులకు రూ.50 వేలు ఇవ్వగా.. ఇప్పుడు ఆర్థిక శాఖ అనుమతులతో టీచర్లకు రూ. 2 లక్షలు, సహాయకులకు రూ. 1 లక్ష చొప్పున నగదు ప్రోత్సాహకం అందిస్తున్నారు.

మరోవైపు చిన్నారుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు మార్చి నెలలో సీఎం రేవంత్ రెడ్డి ‘తొలిముద్ద’ (బ్రేక్‌ఫాస్ట్) పథకాన్ని ప్రారంభించారు. ఆరేళ్ల లోపు పిల్లలకు సరైన పోషకాలు అందితేనే మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుందన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.

విద్యాశాఖ గూటికి అంగన్‌వాడీలు : రాబోయే రోజుల్లో విద్యావ్యవస్థలో కీలక మార్పులు రాబోతున్నాయి. వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియట్ విద్యను సెకండరీ స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు కిందకు తీసుకురానున్న నేపథ్యంలో, సీనియర్ ఐఏఎస్ అధికారులు మరో కీలక ప్రతిపాదన చేస్తున్నారు. ప్రస్తుతం శిశు సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను పూర్తిగా విద్యాశాఖ పరిధిలోకి మార్చితే, ప్రీ-ప్రైమరీ విద్య మరింత పటిష్టంగా మారుతుందని యోచిస్తున్నారు. ఈ మార్పులు అమలైతే అంగన్‌వాడీల రూపురేఖలు, విద్యా ప్రమాణాలు జాతీయ స్థాయిలో ఆదర్శంగా నిలవడం ఖాయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News