Assigned lands forensic audit Telangana : శాసనసభలో రెవెన్యూ సమస్యలపై జరిగిన చర్చలో సీపీఐ శాసనసభాపక్ష నేత కూనంనేని సాంబశివరావు అధికార యంత్రాంగంపై విరుచుకుపడ్డారు. ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల కింద అమాయక రైతులను వెళ్లగొట్టి, పెద్దలు బలవంతంగా భూములను లాక్కున్నారని ఆరోపించారు. “రికార్డుల్లో అవి ఇప్పటికీ అసైన్డ్, అటవీ భూములుగానే ఉన్నాయి. కానీ తెరవెనుక క్రయవిక్రయాలు జరిగిపోయాయి. ఈ అక్రమ భూములు ఎన్ని చేతులు మారాయో వెలికితీయడానికి తక్షణమే ‘ఫోరెన్సిక్ ఆడిట్’ చేపట్టాలి” అని డిమాండ్ చేశారు.
నవాబుల ఆస్తులు ఎవరి చేతుల్లో ఉన్నాయి : తెలంగాణ విలీనానంతరం నవాబులు భూములు వదిలి పాకిస్థాన్‌కు వెళ్లారని, ఆ వేలాది ఎకరాల విలువైన భూములు ఇప్పుడు ఎవరి కబంధహస్తాల్లో ఉన్నాయో తేల్చాలన్నారు. అధికారులు, కొందరు నేతల అండతోనే భూమాఫియా, పైరవీకారులు రెచ్చిపోతున్నారని మండిపడ్డారు.
ఏసీబీ దాడుల లెక్కలతో విస్మయం : రాష్ట్రంలో అవినీతి ఏ స్థాయిలో వేళ్లూనుకుందో చెప్పేందుకు ఇటీవల ఏసీబీ దాడుల్లో కేవలం 25 మంది అధికారుల వద్దే ఏకంగా రూ.4,500 కోట్ల అక్రమాస్తులు బయటపడటమే ప్రత్యక్ష నిదర్శనమని కూనంనేని విమర్శించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, తెరవెనుక సాగుతున్న అవినీతి బాగోతాలను బట్టబయలు చేసి, పెద్దల చేతుల్లో చిక్కుకున్న భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు.

